కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం మరింత సులభతరం
డాబాగార్డెన్స్ (విశాఖ): శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం, సేవల టికెట్ల జారీ ప్రక్రియను దేవదాయ శాఖ డిజిటలైజేషన్ ద్వారా సులభతరం చేసింది. భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదం టికెట్లను సులభంగా పొందే వీలు కల్పించారు. మన మిత్ర యాప్ నంబరు 9552300009, దేవదాయ శాఖ అధికారిక వెబ్‌సైట్ aptemples.ap.gov.in ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. ఏపీ టెంపుల్స్ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, లాగిన్ అయిన తర్వాత టికెట్లను బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఆన్‌లైన్ ద్వారా పొందిన టికెట్‌ను ప్రింట్ తీసుకోవడం, ఫోన్‌లో చూపించడం ద్వారా స్కాన్ చేయించుకుని భక్తులు వేగంగా దర్శనం పొందవచ్చు. ప్రసాదాల కొనుగోలుకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. ఇప్పటికే 315 మంది భక్తులు ఆన్‌లైన్ ద్వారా దర్శనం చేసుకోగా, 74 మంది భక్తులు నగదు రహిత లావాదేవీల ద్వారా ప్రసాదాలను పొందినట్లు ఆలయ ఈవో కె.శోభారాణి తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శనాలు, సేవలను వేగవంతం చేసేందుకు ఈ డిజిటల్ విధానం ఎంతో దోహదపడుతుందన్నారు.


