సంపద పోయినా.. ప్రాణం దక్కలేదు
అచ్యుతాపురం రూరల్: అరుదైన బ్లూ వేల్‌ను (నీలి తిమింగలం) రక్షించాలన్న మత్స్యకారుల ప్రయత్నాలు వృథా అయ్యాయి. అందుకోసం వారు సుమారు రూ.3 లక్షల విలువైన వలను, రూ.లక్ష విలువైన మత్స్య సంపదను కోల్పోయారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ భారీ తిమింగలానికి మూడు రోజుల అనంతరం సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, అధికారుల పర్యవేక్షణలో అంత్యక్రియలు జరిపారు. పూడిమడక తీరంలో శనివారం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ నీలి తిమింగలం చిక్కిన విషయం తెలిసిందే. మత్స్యకారులు వెంటనే ఆ తిమింగలాన్ని తిరిగి సముద్రంలో విడిచి పెట్టేందుకు శత విధాలా ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. రెక్కాడితే గాని డొక్కాడని మత్స్యకారులు అరుదైన నీలి తిమింగలాన్ని కాపాడే క్రమంలో విలువైన వలను, తిమింగలంతోపాటు వలకు చిక్కిన మత్స్య సంపదను సముద్రంలో విడిచిపెట్టి మానవత్వం చాటుకున్నారు. అయినప్పటికీ శనివారం రాత్రి తిమింగలం మృతి చెందడంతో తీవ్ర ఆవేదన చెందారు. సీఎం చంద్రబాబు పర్యటన హడావుడిలో ఉన్న సంబంధిత శాఖల అధికారులు ఆరోజు ఇటువైపు దృష్టి పెట్టలేదు. వారంతా సోమవారం రావడంతో మూడు రోజులపాటు తిమింగలం మృతదేహం వద్ద మత్స్యకారులు కాపలా కాశారు.
సుమారు 10 సంవత్సరాల వయసు
భారీ నీలి తిమింగలం జీవన ప్రమాణం సుమారు 150 నుంచి 200 సంవత్సరాలు ఉంటుందని వైద్యులు తెలిపారు. అయితే ఇక్కడ మృతి చెందిన నీలి తిమింగలం పొడవు, వెడల్పుతోపాటు వెన్నుపూస రింగులను బట్టి సుమారు 8 నుంచి 10 సంవత్సరాల వయసు ఉంటుందన్నారు. మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోస్టుమార్టం చేసినట్లు దోసూరు వెటర్నరీ వైద్యురాలులు ఉమా మహేశ్వరి, ఎంజేపురం వైద్యుడు జగదీశ్, మాడుగుల వైద్యుడు శివకుమార్ తెలిపారు. పోస్టుమార్టంలో నీలి తిమింగలం అవయవాలు సేకరించి విశాఖపట్నంలో ల్యాబ్‌కు తరలించాన్నారు. ల్యాబ్ నివేదికలు వచ్చిన తరువాత తిమింగలం మృతికి గల కచ్చితమైన కారణాలు తెలియజేస్తామన్నారు. తిమింగలాన్ని ఖననం చేసిన వారిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు ఎం.రామకృష్ణ, ఇ.శివకుమార్, మైరెన్ ఎస్‌ఐ బిహెచ్.వి.ఎస్.ఎన్.రాజు, ఫిషరీస్ అధికారి రవితేజ, పూడిమడక వీఆర్వో అప్పలరాజు ఉన్నారు.
పరిశ్రమల వ్యర్థాలే కారణం
పరిశ్రమల వ్యర్ధ రసాయనాలను నేరుగా సముద్రంలో పైప్‌లైన్ల ద్వారా కలిపేయడం వలన విలువైన మత్స్య సంపద కోల్పోతున్నామని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు. ఈమధ్యనే ఉప్పుటేరులో విలువైన మత్స్య జాతులు, సముద్రంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు మృత్యువాత పడ్డాయని, ఆ విధంగానే భారీ నీలి తిమింగలం స్పృహ కోల్పోయి మృతి చెందిందని మత్స్యకార నాయకుడు చేపల తాతయ్యలు పేర్కొన్నారు. ఇప్పటికై నా మత్స్య సంపదకు హాని కలగకుండా ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఈటీపీ) ద్వారా పరిశ్రమల్లో వ్యర్ధాలను శుద్ధి చేసి సముద్రంలోకి విడిచిపెట్టాలని కోరుతున్నారు. రూ.3 లక్షల విలువైన వలను, లక్ష విలువ గల చేపలను కోల్పోయామని, ప్రభుత్వం పరిహారం ఇప్పించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.
సంపద పోయినా.. ప్రాణం దక్కలేదు


