భళా... ఆమె నృత్య కళ
● ఉద్యోగం చేస్తూనే శిక్షణ ● ఆసక్తి చూపుతున్న బాలబాలికలు ● శాసీ్త్రయ నృత్యంలో రాణింపు ● నాట్య గురువు ఉమాదేవి స్ఫూర్తిదాయకం
నర్సీపట్నం: సంస్కృతీ సంప్రదాయాలను బోధిస్తూనే... మనసుకు ఆహ్లాదం పంచుతోంది నృత్యం. ఈ కళావైభవాన్ని భావితరాలకు పంచేందుకు కృషి చేస్తున్నారు నాట్యగురువు ఉమాదేవి. అభినయం, నృత్యంలో ఎవరూ సాటిరారనేలా తన శిష్య బృందంతో నర్తిస్తూ ప్రశంసలందుకుంటున్నారు. శాసీ్త్రయ నృత్యంలో చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నారు.
తొలుత నృత్యంపై ఆసక్తి పెంచుకున్నామె, అందులో పట్టుసాధించి శిక్షకురాలిగా మారారు. ప్రభు త్వ సంస్థలో ఔట్ సోర్సింగ్ విభాగంలో ఉద్యోగిగా స్థిరపడినప్పటికీ నృత్యంపై మక్కువతో పది మందిని తీర్చిదిద్దాలనే తపనతో పెదబొడ్డేపల్లిలో శ్రీమృతేశ్వర నాట్య అకాడమీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 మంది బాలికలు శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు తర్ఫీదు ఇస్తున్నారు.
పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు...
శాశ్వత శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న బాలికలు, శిక్షకురాలు ఉమాదేవి ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. తిరుపతి, అన్నవరం, అప్పనపల్లి పాటు నర్సీపట్నం పరిసర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక ప్రదర్శనలు ఇస్తూ ప్రశంసలు పొందుతున్నారు. అటు చదువులోనూ ఇటు కళల్లోనూ రాణిస్తూ పలువురి మెప్పు అందుకుంటున్నారు. బాలబాలికల్లో దాగి ఉన్న అంతర్గత ప్రతిభకు పదును పెడుతూ శాసీ్త్రయ నృత్యంలో ఎంతో మంది ప్రముఖల మన్ననలు పొందుతున్నారు. సంప్రదాయ నృత్యంతో శ్రీమృతేశ్వర నాట్య అకాడమీ బాలికలు నర్సీపట్నం పేరున నలుదిశలా వ్యాపింపజేస్తున్నారు.
వేసవి విజ్ఞాన శిబిరంలోనూ తర్ఫీదు
మరికొంత మంది బాలబాలికలను శాసీ్త్రయ నృత్యంలో తీర్చిదిద్దేందుకు నర్సీపట్నం శారదానగర్‌లో వేసవి నృత్య శిక్షణ శిబిరాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ శిబిరంలో ఆంధ్రనాట్యంలోని అన్నమాచార్యులు, త్యాగరాజు కీర్తనలపై శాసీ్త్రయ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు శాసీ్త్రయ నృత్యంపై 35 మంది బాలబాలికలకు నేర్పిస్తున్నారు. అటు చదువులోనూ..ఇటు సంప్రదాయ నృత్యంపై చిన్నారులు ఆసక్తి చూపుతున్నారు.
భళా... ఆమె నృత్య కళ


