ఏపీఐఐసీ ప్రాజెక్టు ఏరియాలో ఆర్డీవో పర్యటన
నక్కపల్లి: ఏపీఐఐసీ ప్రాజెక్టు ఏరియాలో గురువా రం నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ పర్యటించా రు. ఏపీఐఐసీ సేకరించిన 4500 ఎకరాల్లో బల్క్‌డ్రగ్ పార్క్ కోసం 2 వేల ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పించే పనులు జరుగుతున్నాయి. కోట్లాది రూపాయల వ్యయంతో ఇంటర్నల్ రోడ్లు, డ్రెయినేజీలు, తదితర అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. రైతుల నుంచి సేకరించిన భూముల్లో పరిహారం, ప్యాకేజీ చెల్లించిన భూములను ఏపీఐఐసీ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్లో ఉన్న కొబ్బరి, జీడి, మామిడి తోటలను తొలగించారు. బల్క్‌డ్రగ్ పార్క్, ఆర్సిలర్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్ అవసరాల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను ఏపీఐఐసీ వారే కల్పిస్తున్నారు. ఎస్‌ఆర్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో సివిల్ పనులు జరుగుతున్నాయి. వీటిని ఆర్డీవో పరిశీలించారు. ఏయే గ్రామాల్లో ఎంత భూమిని ఏపీఐఐసీ స్వాధీ నం చేసుకుంది.. ఏయే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి.. ఏమైనా అడ్డంకులు ఉన్నాయా.. తదితర వివరాలను ఏపీఐఐసీ అధికారులను అడిగి తెలుసుకున్నారు.


