నేల రాలిన రైతుల ఆశలు
చోడవరం: అకాల వర్షాలతో మామిడి, జీడిమామిడి తోటల రైతుల ఆశలు ఆవిరయ్యాయి. రెండ్రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురవడంతో పంట చాలా మేర దెబ్బతింది. చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాల్లో సుమారు 100 ఎకరాల్లో మామిడి, జీడిమామిడి పంటకు ఈదురుగాలుల కారణంగా నష్టం వాటిల్లింది. ఈ ఏడాది మొదట్లో పూత బాగా వచ్చినప్పటికీ వర్షాలు కురవకపోవడంతో పాటు పొగమంచు కమ్ముకుంది. మంచు వల్ల చాలా మేర పూత రాలిపోయింది. దీంతో ఆలస్యంగా పిందెలు వచ్చాయి. కనీసం ఆ పంటైనా చేతికి వస్తే పెట్టుబడులైనా దక్కుతాయని రైతులు ఆశించారు. ఇప్పుడు పక్వానికి చేరుకుంటున్న సమయంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షాలు మామిడి రైతులను నిండా ముంచేశాయి. గురువారం రాత్రి గాలులు వీయడంతో పక్వానికి వచ్చిన మామిడి కాయలు చాలా మేర నేలరాలిపోయాయి. తోటల్లో 20 శాతం పంట నేలరాలిపోయింది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి తోటలు లీజుకు తీసుకున్న రైతులు, సొంతంగా తోటలు కాపు కాస్తున్న వారు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలు నిండా ముంచేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అకాల వర్షాలకు దెబ్బతిన్న మామిడి, జీడి మామిడి
100 ఎకరాల్లో పంట నష్టం


