
మెట్రోకు 98 ఎకరాల సేకరణ
● ఇందుకోసం రూ.670 కోట్లు ఖర్చు ● విశాఖ కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట (విశాఖ): విశాఖ మెట్రో ప్రాజెక్టుకు 98 ఎకరాల భూములు అవసరం ఉందని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. గురువారం తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ 98 ఎకరాల భూముల్లో 46 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉందని, 52 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం రూ.670 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచన వేశామన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం సుమారు వెయ్యి ఎకరాల వరకు భూసేకరణ చేపడుతున్నామని, ఆనందపురం మండలం పరిధిలో తర్లువాడ, కనమం, బీడిపాలెం, జగన్నాథపురం తదితర గ్రామాల్లో భూములు ఉన్నట్లు వెల్లడించారు. వీటిలో కొన్ని ప్రభుత్వ భూములు ఉండగా.. మరికొన్ని అసైన్డ్ భూములు ఉన్నాయని కలెక్టర్ వివరించారు. విశాఖలో ఐటీ సంస్థలు నెలకొల్పడానికి పలువురు ముందుకు వస్తున్నారని, ప్రభుత్వ అనుమతితో వాటి కార్యకలాపాలు ప్రారంభించడానికి చర్యలు చేపట్టామన్నారు. ఐటీ సంస్థలు ఏర్పాటు చేసేవారికి రాయితీలు ఇస్తామన్నారు. బీచ్‌రోడ్డులో పర్యాటకులను ఆకర్షించే విధంగా బస్సులను ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు. విశాఖలో కీలకమైన మత్స్య రంగం ద్వారా రాబడులు పెంచడానికి చర్యలు చేపట్టామన్నారు. జిల్లా స్థూల ఆదాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.1.50 లక్షల కోట్లు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, ఇతర సేవా రంగాల ద్వారా 15 శాతం వృద్ధిని నమోదు చేస్తే.. జిల్లా స్థూల ఆదాయం పెంపు సాధ్యమన్నారు. జిల్లాలో 200 హెక్టార్లలో బీడు భూములను వ్యవసాయ భూములుగా మార్పు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కొబ్బరి, మామిడి తోటల పెంపకానికి అధిక ప్రాధాన్యమిస్తామని కలెక్టర్ వివరించారు.