● గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి ● లేట‘రైట్ రైట్’ అంటున్నారెందుకో! ● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్
నర్సీపట్నం : స్పీకర్ అయితే ఎవరికి గొప్ప.. నీ పార్టీ నాయకులకు గొప్పేమో.. మాకేంటి అని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ స్పీకర్ అయ్యన్నపాత్రుడి తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నూకాలమ్మ తల్లి గుడికి సంబంధించిన విరాళం విషయంపై ‘గౌరవ స్పీకర్’ అని అయ్యన్నపాత్రుడిని సంభోదిస్తే..అయ్యన్నపాత్రుడు ఒక పోరంబోకు చేత తనపై విమర్శలు చేయించారన్నారు. తమకు గౌరవం ఇస్తే తాము గౌరవిస్తామన్నారు. స్పీకర్ అయితే ఎవరికి గొప్ప? అని ధ్వజమెత్తారు. 2019 డిసెంబరు తర్వాత టెండర్లు పిలిచి నూకాలమ్మ తల్లి గుడి కడితే తమ హయాంలో కట్టామని స్పీకర్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. రూ.10 లక్షలు సీఎంఆర్ అధినేత ఇస్తే ఆలయ చైర్మన్ ప్రతి ఫైసా గుడి కోసం ఖర్చు పెట్టారని, దానిపై అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. శ్మశానం సుందరీకరణకు సీఎంఆర్ అధినేత రూ.20 లక్షలు ఇస్తే దానిపై మాట్లాడరన్నారు. మీరు చేస్తే నీతి మేము చేస్తే అవినీతా? అని ప్రశ్నించారు.
ఏపీ టాక్స్...వసూళ్ల మాటేమిటో?
రోలుగుంట మండలంలో క్వారీల్లో లక్షల రూపాయలు దండుకుంటున్నారని విమర్శించారు. ఎవరని అడిగితే ఏపీ ట్యాక్స్ అంటున్నారని, త్వరలో ఏ అంటే ఏంటో..పీ అంటే ఏంటో బయటకు వస్తుందన్నారు. అనాడు అధికారంలోకి రాకముందు లేటరైట్ అడ్డుకుంటామని బిల్డప్ ఇచ్చారని, ఇప్పుడు లేటరైట్ రైట్ రైట్ అంటున్నారని మండిపడ్డారు. ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు తరిమి తరిమి కొడతారని అయ్యన్నపాత్రుడుని హెచ్చరించారు.