నర్సీపట్నం:
ఏలేరు–తాండవ ఎత్తిపోతల పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువుతీరి తొమ్మిది నెలలు దాటినా ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చిరకాల స్వప్నం నెరవేరుతుందా లేదా అని ఆయకట్టు రైతులు మల్లగుల్లాలు పడుతున్నారు. తాండవ ప్రాజెక్టును 4,400 ఎంసీఎఫ్‌టీల నీటి నిల్వ సామర్ధ్యంతో 1977లో నిర్మించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూ.50 కోట్లతో కాలువలు, జలాశయం ఆధునికీకరణ చేపట్టారు. వైఎస్సార్ పుణ్యమాని చివరి ఆయకట్టు భూములకు నీరు అందుతోంది. మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఒక అడుగు ముందుకేసి మరింత సస్యశ్యామలం చేసేందుకు ఏలేరు కాలువకు 68 కిలోమీటర్ల మేర లైనింగ్‌ను ఆధునికీకరించి ఎత్తిపోతల పథకాల ద్వారా రెండు పంటలకు సమృద్ధిగా నీరందించేందుకు రూ.470.05 కోట్లు కేటాయించారు. ఏలేరు ఇంజినీరింగ్ విభాగం సర్వే పూర్తి చేశారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టడం ఆలస్యమైంది. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడింది. కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. 20 శాతం కూడా పనులు పూర్తి కాని ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఎత్తిపోతల పథకాన్ని పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పథకం నిర్మాణంపై కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణంపై రైతాంగంలో సందిగ్ధత నెలకొంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే..
ఎత్తిపోతల పథకం పూర్తయితే.. అనకాపల్లి, కాకినాడ జిల్లాల పరిధిలోని ఆరు మండలాల రైతులకు మేలు చేకూరుతుంది. మొత్తం 77 గ్రామాల్లో 51,467 ఎకరాలకు సాగునీటికి ఢోకా లేకుండా, 5600 ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరిచ్చేలా ఏలేరు ఎడమ కాలువపై నాలుగుచోట్ల ఎత్తిపోతల పథకాలను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొదటి ఎత్తిపోతల ద్వారా కోటనందూరుకు 135 రోజులు, రెండో ఎత్తిపోతల ద్వారా గొలుగొండపేటకు 135 రోజులు, మూడో ఎత్తిపోతల ద్వారా తాండవ కాలువకు 135 రోజులు, నాలుగో ఎత్తిపోతల ద్వారా గునిపూడి నుంచి తాండవ జలాశయానికి 90 రోజులపాటు 200 క్యూసెక్కుల చొప్పున నీరు అందించేందుకు పథకాన్ని రూపొందించారు. ఇదే విధంగా ఏలేరు కాలువకు 68 కిలోమీటర్ల వరకు ఆధునికీకరణ, చింతలూరు వద్ద 1100 ఎకరాల కొత్త ఆయకట్టుకు 135 రోజులపాటు 25 క్యూసెక్కుల నీరు, అచ్చంపేట వద్ద 2100 ఎకరాలకు 25 క్యూసెక్కుల చొప్పున 135 రోజులపాటు 0.238 టీఎంసీల నీరు, ములపూడి ప్రాంతానికి 2400 ఎకరాలకు 25 క్యూసెక్కుల చొప్పున 135 రోజులపాటు 0.292 టీఎంసీల నీరు అందించేందుకు ఆలోచన చేశారు.
● ఏలేరు–తాండవ ఎత్తిపోతల పథకంపై నీలినీడలు ● శ్రద్ధ చూపని