రాంబిల్లి (అచ్యుతాపురం): తీర ప్రాంత రక్షణకు దోహదం చేసే మడ అడవుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయ్‌కృష్ణన్ పిలుపునిచ్చారు. రాంబిల్లి మండలం లాలం కోడూరు శివారు సీతపా లెం బీచ్‌లో బుధవారం ఆమె మొక్కలు నాటారు. ఉపాధి హామీ పథకం, వాస్కా ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మడ అడవుల అభివృద్ధి పథకంలో భాగంగా కలెక్టర్ విజయ్‌కృష్ణన్ మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత కాపాడటంలోనూ, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ మడ అడవులు నష్ట నివారణకు ఉపయోగపడతాయని తెలిపారు. నేల కోతను తగ్గించేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో కార్బన్ డయాకై ్సడ్‌ను గ్రహించి ఆక్సిజన్ శాతం పెంచేందుకు మడ అడవులు దోహదపడతాయన్నారు. లక్షా డభ్బై ఐదు వేల నిధులతో ఎన్‌ఆర్‌జీఎస్ ద్వారా మొక్కల్ని నాటుతున్నామని తెలిపారు. మడ అడవుల పెంపకానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చెన్నయ్‌కి చెందిన ఎం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ సమకూరుస్తుందని తెలిపారు. అడిషనల్ కమిషనర్ ఎం.శివప్రసాద్ మాట్లాడుతూ వాస్కా ప్రాజెక్టుతో పాటు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో భాగంగా లాలం కోడూరు పరిధిలో 24 ఎకరాలను ఎంపిక చేశామని తెలిపారు. డ్వామా పీడీ పూర్ణిమాదేవి,ఎం.ఎస్. స్వామినాథన్ శాస్త్రవేత్త నాగరాజన్, వాస్కా ప్రాజెక్టు స్టేట్ కో ఆర్డినేటర్ వనపర్ల సంతోష్ కుమార్, ఎంపీడీవో విజయ మాధురి, సర్పంచ్ గుణ, ప్లాంటేషన్ మేనేజర్ సురేశ్, వాస్కా సిబ్బంది దండే ప్రసాద్ పాల్గొన్నారు.


