పండగలోగా బకాయిలు చెల్లించాల్సిందే
గోవాడ సుగర్స్ అఖిల పక్షం సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి, గుడివాడ, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ, వైఎస్సార్‌సీపీ పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, రైతు సంఘాలు, కార్మిక సంఘాల ప్రతినిధులు
చోడవరం:
గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చెరకు రైతులకు సంక్రాంతి పండగలోగా బకాయిలు చెల్లించాలని అఖిల పక్ష సమావేశం డిమాండ్ చేసింది. లేనిపక్షంలో దశలవారీ ఆందోళనకు దిగుతామని హెచ్చరించింది. ఈ ఏడాది ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయకపోవడం, చెరకు ప్రైవేటు ఫ్యాక్టరీకి పంపడం, గత ఏడాది చెరకు బకాయిలు రైతులకు చెల్లించకపోవడం, కార్మికులకు బకాయి జీతాలు ఇవ్వడం పోవడం, ప్రభుత్వం పూర్తిగా ఫ్యాక్టరీని, చెరకు రైతులను నిర్లక్ష్యం చేయడంపై ఉద్యమానికి దిగేందుకు రాజకీయ, రైతు,కా ర్మిక సంఘాల నాయకులు సిద్ధమయ్యారు. ప్రభుత్వానికి చెరకు రైతుల కష్టాలు తెలియజేందుకు, అవసరమైతే ఆందోళనలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకునేందుకు అఖిలపక్ష సమావేశాన్ని చోడవరంలో శుక్రవారం నిర్వహించారు. సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మినహాయించి వైఎస్సార్‌సీపీ, జనసేన, బీజేపీ, సీపీఎం, సీపీఐ,రైతు సంఘం, రైతుకూలీ సంఘం, ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ప్రతినిధులు, ఫ్యాక్టరీ కార్మిక సంఘాల ప్రతినిధులు, చెరకు రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీని పరిరక్షించడంలో చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, ఎంపీ, జిల్లా మంత్రులు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని సమావేశంలో అఖిలపక్షం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ ఏడాది ఫ్యాక్టరీ మహాజనసభను కూడా నిర్వహించలేదని, గత సీజన్‌కు సంబంధించిన రైతుల బకాయిలు, కార్మికుల జీతభత్యాలు వెంటనే చెల్లించాలని, ఫ్యాక్టరీకి ప్రభుత్వం రూ. 50కోట్లు గ్రాంటు ఇవ్వాలని, వెంటనే క్రషింగ్ ప్రారంభించాలని సమావేశం డిమాండ్ చేసింది. సమావేశంలో మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ రైతులు కష్టాలు ఏనాడూ చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే గోవాడ ఫ్యాక్టరీకి, చెరకు రైతులకు మేలు జరిగిందని చెప్పారు. ఫ్యాక్టరీని, రైతులను ఆదుకుంటామని చెప్పిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు, ఎంపీ పట్టించుకోకపోవడం సిగ్గు చేటని మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఫ్యాక్టరీని పరిరక్షించుకుకోవడానికి పూర్తిస్థాయిలో ఆందోళనకు రైతులంతా కలిసి దిగుతామని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం చెరకు రైతుల జీవనాధారాన్ని తుంచేసిందని, ఫ్యాక్టరీని బాగుచేస్తామని, రూ. 4వేలు గిట్టుబాటు ధర ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. చెరకు బకాయిలు వెంటనే చెల్లించాలని, లేదంటే రైతులకు, కార్మికులతో కలసి చేసే ఉద్యమానికి వైఎస్సార్‌సీపీ పూర్తిగా మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ చోడవరం పరిశీలకుడు దంతులూరి దిలీప్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమానికి మద్దతిస్తాం
ఫ్యాక్టరీని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 24వేల మంది చెరకు రైతులు, వారిపై ఆధారపడిన 2లక్షల మంది కూలీలు, కుటుంబసభ్యులు ఇప్పుడు రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం స్పందించే వరకూ ఉద్యమాన్ని చేయాలి. ఉద్యమానికి తామంతా మద్దతు ఇస్తాం.
– దేవరపల్లి చంటి, బీజేపీ మండల అధ్యక్షుడు, చోడవరం
ప్రభుత్వం కళ్లు తెరిచేలా ఉద్యమం
చెరకు రైతులను నిర్లక్ష్యంగా వదిలేసిన చంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా పోస్టుకార్డు ఉద్యమాన్ని చేపట్టాలి. ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న రైతులు, కూలీలు ఈ ఉద్యమంలో పాల్గొనాలి. ఎంపీ, ఎమ్మెల్యేలు ఫ్యాక్టరీని, రైతులను మోసం చేశారు. ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఉద్యమాన్ని చేయడానికి సిద్దం.
–కొణతాల హరనాథ్, ఆమ్‌ఆద్మీపార్టీ జిల్లా అధ్యక్షుడు
పండగలోగా బకాయిలు చెల్లించాల్సిందే


