గజవాహనంపై వెంకన్న తిరువీధి సేవ
నక్కపల్లి: ధనుర్మాస అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉపమాక వేంకటేశ్వర స్వామివారికి శుక్రవారం గజవాహనంపై తిరువీధిసేవలు నిర్వహించారు. ముందుగా కొండపై మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం, నిత్యార్చనలు పూర్తిచేశారు.అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారికి, వేణుగోపాల స్వామివారికి పూజలు నిర్వహించారు. శ్రీదేవి,భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారిని గజవాహనంపై, గోదాదేవి అమ్మవారిని పల్లకిలో ఉంచి తిరువీధి సేవలకు తీసుకెళ్లారు. అనంతరం గోదాదేవి సన్నిధిలో తిరుప్పావై 17వ పాశురాన్ని విన్నపం చేశారు. రాపత్తు అధ్యయనోత్సవాల్లో భాగంగా వైష్ణవ స్వామి ద్రవిడ వేదపారాయణం నిర్వహించిన అనంతరం రాత్రి తిరువీధి సేవలు నిర్వహించారు.ఈ కార్యక్రమాల్లో అర్చక స్వాములు ప్రసాదాచార్యులు, కృష్ణమాచార్యులు,శేషాచార్యులు, పాల్గొన్నారు.


