తప్పుల తడకగా పట్టాదారు పాసు పుస్తకాలు
కశింకోట: ప్రభుత్వం రైతులకు శుక్రవారం నుంచి పంపిణీ చేస్తున్న భూమి యాజమాన్యపు హక్కు పత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలు తప్పుల తడకగా ఉన్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా వందేళ్ల తర్వాత భూముల రీసర్వే నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేపట్టారు. అయితే రీసర్వేలో తప్పులు చోటు చేసుకున్నాయని, మళ్లీ సర్వే జరిపించి సవరణ చేసి అందజేయనున్నట్లు చంద్రబాబు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఏదో అడపా దడపా ఫిర్యాదులు వచ్చిన గ్రామాల్లో మొక్కుబడిగా సర్వే జరిపించి గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సర్వే చేసిన నివేదిక ఆధారంగా ఇచ్చిన పాసు పుస్తకాల స్థానంలో రాజముద్రతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త పుస్తకాల పంపిణీని శుక్రవారం చేపట్టింది. అవి తప్పుల తడకగా ఉండడంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. జెట్టపురెడ్డితుని రెవెన్యూ పరిధిలోని భూములకు సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాల్లో జెట్టపురెడ్డితుని గ్రామం పేరు తెలుగులో జెత్తపురెడ్డి తునిగా తప్పుగా పడింది. ఆంగ్లంలో మాత్రం సరిగానే ఉంది. కొందరి పేర్లు ఆంగ్లం, తెలుగులో తేడా ఉన్నాయి. గొంతిన వెంకట రమణ అని తెలుగులో సరిగానే పేరు ఉన్నా ఆంగ్లంలో మాత్రం స్పెల్లింగ్ తప్పుగా నమోదైంది. ఇలా చాలామంది రైతుల పేర్లు తప్పుగా నమోదయ్యాయి. దీనివల్ల భవిష్యత్‌లో రుణాలు, ప్రభుత్వ పథకాలు పొందడానికి, రిజిస్ట్రేషన్ సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవల్సి ఉంటుందని పలువురు ఆవేదన చెందుతున్నారు. కొన్ని పుస్తకాలపై ఆధార్, సెల్‌ఫోను నంబర్లను 9 అంకెలు నమోదు చేశారు. దీంతో వీటి స్థానంలో ఆధార్, సెల్ నంబర్లు సరిగా నమోదు చేసుకోవాలంటే అధికారుల చుట్టూ ఎన్నాళ్లు తిరగాల్సి వస్తుందోనని రైతులు మదన పడుతున్నారు. అలాగే భూమి విస్తీర్ణం తక్కువగా వచ్చిందని కొందరు, పుస్తకంలో చిరునామా లేదని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. వీటిని ఎలా సవరించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. తప్పులను సవరించిన తర్వాతే పాసు పుస్తకాల పంపిణీ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గ్రామ సభల్లో కొంతమందికి మాత్రమే నామ మాత్రంగా పాసు పుస్తకాలు పంపిణీ చేపట్టి మిగిలిన వారికి శనివారం అందజేస్తామని అధికారులు తెలిపారు. పాసు పుస్తకాల కోసం మళ్లీ రావలసి ఉండటంతో పనులు మానుకోవలసి వస్తుందని రైతులు ఆవేదన చెందారు. అందువల్ల గ్రామ సభ పెట్టిన రోజు వచ్చిన రైతులందరికి పాసు పుస్తకాలు అందజేయాలంటున్నారు. ఎ.ఎస్.పేట, గొబ్బూరుపాలెం, నరసాపురం, చింతలపాలెం, జెట్టపురెడ్డితుని రెవెన్యూ గ్రామాల్లో పాసు పుస్తకాలను పంపిణీ ప్రారంభించారు. తహసీల్దార్ తిరుమలరావు, స్థానిక నాయకులు వీటిని పంపిణీ చేశారు. కొంత మందికి పాసు పుస్తకాలు అందజేసి మిగిలిన రైతులకు శనివారం అందజేస్తామని తెలిపారు. రెవెన్యూ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
తప్పుల తడకగా పట్టాదారు పాసు పుస్తకాలు
తప్పుల తడకగా పట్టాదారు పాసు పుస్తకాలు
తప్పుల తడకగా పట్టాదారు పాసు పుస్తకాలు


