దినదిన గండం ‘గోవాడ’ భవితవ్యం | - | Sakshi
Sakshi News home page

దినదిన గండం ‘గోవాడ’ భవితవ్యం

Mar 10 2025 11:02 AM | Updated on Mar 10 2025 10:56 AM

● ఆర్థిక ఇబ్బందులతో సుగర్‌ ఫ్యాక్టరీ సతమతం ● నిధులు తెస్తామని కనిపించకుండా పోయిన ఎంపీ, ఎమ్మెల్యే ● ఫ్యాక్టరీ మనుగడపై ఆందోళన చెందుతున్న చెరకు రైతులు, కార్మికులు ● నేడు వైఎస్సార్‌సీపీ, సీపీఎం ఆధ్వర్యంలో రైతులతో ఆందోళన ● నేడు శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గోవాడ రాక

నేడు చెరకు రైతులతో ఆందోళన

ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ, సీపీఎం ఆధ్వర్యంలో వేర్వేరుగా ఈనెల 10వ తేదీన చెరకు రైతులతో కలిసి ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యాయి. గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ వద్ద సోమవారం ఉదయం 10గంటలకు సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించే ఆందోళనకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు వస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3గంటలకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో చెరకు రైతులతో ఆందోళన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఆందోళనలో ఆ పార్టీ నుంచి శానసమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ పాల్గొననున్నారు. ఆయనతోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా అధ్యక్షుడు బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, స్థానిక సమన్వయకర్త గుడివాడ అమర్‌నాఽథ్‌, మాజీ ప్రభుత్వ విప్‌, అనకాపల్లి పార్లమెంటు పరిశీలకుడు కరణం ధర్మశ్రీ పాల్గొని రైతుల తరపున మద్దతుగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు.

చోడవరం: రైతులకు చెరకు పేమెంట్స్‌ ఇవ్వలేక, కార్మికులకు జీతభత్యాలు చెల్లించలేక, పాత బకాయిలు చెల్లించలేక, క్రషింగ్‌కు కావలసిన సామగ్రికి అవసరమైన ఆర్థిక స్థోమత లేక గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ చాలా దయనీయ స్థితిలో ఉంది. 23,450 మంది సభ్య రైతులు ఉన్న ఈ ఫ్యాక్టరీ నేడో రేపో మూసివేసే దుస్థితికి రావడం రైతులను, కార్మికులను ఆందోళనకు గురిచేస్తోంది. 2019 సంవత్సరానికి ముందు గత టీడీపీ ప్రభుత్వం హాయాంలో ఫ్యాక్టరీ పాలకమండలిలో ఉన్న టీడీపీ పాలకవర్గం సుమారు రూ. 150 కోట్లు అప్పుల ఊబిలోకి నెట్టింది. అప్పట్లో అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి ఆర్థికసాయం అందించలేదు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా ఫ్యాక్టరీని ఆధుకుంది. ప్రభుత్వ విప్‌ హోదాలో అప్పటి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఉప ముఖ్యమంత్రిగా బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమల శాఖామంత్రిగా గుడివాడ అమర్‌నాఽథ్‌ ఈ ఫ్యాక్టరీని కాపాడడానికి ఎంతో కృషి చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కూడా సానుకూలంగా స్పందించి ఐదేళ్లలో రూ.89 కోట్లు ఆర్థిక సాయం అందించారు. దీంతో ఫ్యాక్టరీ నెమ్మదిగా అప్పుల ఊబిలోంచి కొంతమేర బయటపడింది. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం గడిచిన పది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఫ్యాక్టరీకి సాయం ఇవ్వలేదు. మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు ఉప ఉత్పత్తుల యూనిట్లు నెలకొల్పి ఫ్యాక్టరీని పూర్తిగా అభివృద్ధి చేసి చెరకు టన్నుకి రూ. 4వేలు గిట్టుబాటు ధర కల్పిస్తామని కూటమి నేతలు ఎంపీ రమేష్‌, ఎమ్మెల్యే కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌ రాజు, బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. ఈ ప్రకటనలు కేవలం కాగితాలకే పరిమితమైపోయాయి. ఎప్పుడో 1962లో 1000 టన్నుల కెపాసిటీతో స్థాపించిన ఈ ఫ్యాక్టరీ దశలవారీగా కెపాసిటీ స్థాయి పెంచుకుంటూ ప్రస్తుతం 5.2 లక్షల టన్నుల క్రషింగ్‌ కెపాసిటీకి వచ్చింది. కానీ మిషనరీ అంతా 30, 40 యేళ్ల నాటిదే కావడంతో పాత మిషనరీతో తరుచూ క్రషింగ్‌లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అత్యవసరంలో రూ. 9 కోట్లు ప్రభుత్వం సాయంగా అందిస్తే తప్పా తాత్కాలికంగా ఫ్యాక్టరీ ఆర్థిక ఇబ్బంది నుంచి గట్టెక్కలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర సహకార రంగంలో 11 ఫ్యాక్టరీల్లో అన్నీ ఇప్పటికే మూతబడి పోగా ఒక్క గోవాడ ఫ్యాక్టరీలో నడుస్తోంది. గత వైఎస్సార్‌సీపీ పాలనలో 4 ఫ్యాక్టరీలకు సుమారు రూ. 200 కోట్లు వరకూ ఆర్థికసాయం అందించి, కార్మికులు, రైతుల పాతబకాయిలన్నీ చెల్లించారు. కూటమి ప్రభుత్వం ఈ ఒక్క ఫ్యాక్టరీని ఆదుకోవడానికి ఎందుకు స్పందించడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు ఇచ్చిన మాటలు ఏమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ

గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ మనుగడ దినదినగండంలా ఉంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమౌతున్న ఫ్యాక్టరీకి ఈ ఏడాది క్రషింగ్‌ సీజన్‌లో ఎదురవుతున్న సమస్యలు మరింతగా కుంగదీస్తున్నాయి. మరో పక్క ఫ్యాక్టరీని, చెరకు రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, నాయకులు చేతులెత్తేయడంతో ఇప్పుడు ఫ్యాక్టరీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement