వివాహేతర సంబంధం: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ప్రీతి

- - Sakshi

అనకాపల్లి: ఉమ్మడి విశాఖ జిల్లాలో సంచలనం రేపిన భర్తను హతమార్చిన భార్య కేసులో నిందితురాలితోపాటు, ఆమె కన్నతండ్రి, ప్రియుడు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్న చోడవరం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.శ్రీనివాసరావు సోమవారం కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు అందించారు. చోడవరంలోని మారుతీనగర్‌కు చెందిన హతుడు ఉద్రాక్ష హరి విజయ్‌ భార్య ప్రీతి, తమ ఇంటి వెనుక ఉండే బలయాది సింహసాయి ప్రణయ్‌కుమార్‌తో వివాహేతర సంబంధంపై తరచూ గొడవలు జరిగేవి. దీనిపై భర్త తనను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నాడన్న కోపంతో భర్తను చంపాలని నిర్ణయించుకుంది.

ఈ మేరకు ఏప్రిల్‌ నెల 17 రాత్రి ఆమె తండ్రి సామిరెడ్డి శంకరరావు, ప్రియుడు ప్రణయ్‌ కుమార్‌, ప్రీతి స్నేహితుడు లావేటి లలిన్‌కుమార్‌(చౌడపల్లి, అచ్యుతాపురం), కర్రి రాము(అచ్యుతాపురం), పిట్లకొండ రాజు అలియాస్‌ బషేర్‌(అనకాపల్లి), అనకాపల్లి సాయి కలిసి హతుడిని బాగా మద్యం సేవించేలా చేశారు. ఆ మత్తులో నిద్రపోతున్న హరివిజయ్‌ను తలగడతో అదిమి హతమార్చారు. చనిపోయాడని నిర్ధారణకు వచ్చాక రాత్రి 2 గంటల సమయంలో ప్రీతి తన కారులో మృతదేహాన్ని ఎక్కించుకుని, భర్త స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా, ముంచంగిపుట్‌ మండలం తీసుకువెళ్తూ, మార్గం మధ్యలో తన భర్తకు గుండె పోటు వచ్చిందని పాడేరు ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి వైద్యులు అతడు చనిపోయినట్టు నిర్ధారించారు.

మృతుడి బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో, పాడేరు పోలీసులు అనుమానాస్పద మృతిగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ప్రీతి తండ్రి సామిరెడ్డి శంకరరావు పాడేరు పోలీసులకు లొంగిపోయి వాస్తవాలను వెల్లడించడంతో హత్య కేసుగా మార్చి, చోడవరం స్టేషన్‌కు కేసును బదిలీ చేసినట్టు సీఐ వెల్లడించారు. దీంతో కేసులో భాగస్వాములైన భార్య ప్రీతి, ఆమె ప్రియుడు ప్రణయ్‌, వారికి సహకరించిన లలిన్‌కుమార్‌, రాము, రాజులను ఆదివారం అరెస్టు చేసినట్టు తెలిపారు. నిందితులను సోమవారం జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్టు సీఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Read latest Anakapalle News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top