ఏజెన్సీ ప్రాంతంలో పండే కూరగాయలకు ఇతర రాష్ట్రాల్లోనూ మంచి గిరాకీ లభిస్తోంది. డుంబ్రిగుడ మండలంలోనిగిరిజన రైతులు సాగు చేస్తున్న క్యారెట్, ముల్లంగి, కొత్తిమీర, చిలగడదుంప తదితర పంటలు స్థానిక వారపు సంతలకే పరిమితం కాకుండా.. విశాఖ మార్కెట్లతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకూ ఎగుమతి అవుతున్నాయి. కొండవాగుల నీటితో సాగు చేస్తున్న ఈ పంటలు గిరిజన రైతులకు ఆదాయమార్గాలుగా మారుతున్నాయి.
డుంబ్రిగుడ: మండలంలోని సొవ్వ పంచాయతీతో పాటు అరమ, కండ్రుమ్, సాగర తదితర పంచాయతీల్లో గిరిజన రైతులు విస్తారంగా కూరగాయలు సాగు చేస్తూ ఆదాయం పొందుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో క్యారెట్, ముల్లంగి, కొత్తిమీర, చిలగడ దుంప (తియ్యదుంప), క్యాబేజీ, వంకాయ, బీన్స్, టమాట తదితర పంటలను సాగు చేస్తున్నారు. దిగుబడులను వారపు సంతల్లో విక్రయించడంతో పాటు ఇతర ప్రాంతాలకు తరలిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు.
కొండవాగుల ఆధారంగా..
కొండవాగుల నుంచి ప్రవహించే నీటిని పైపుల ద్వారా గ్రామాలకు తీసుకొచ్చి పంటలకు సాగునీరు అందిస్తున్నారు. సొవ్వ పంచాయతీలో పండించే కూరగాయలకు విశాఖపట్నంలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎంవీపీ మార్కెట్, సీతమ్మధార మార్కెట్లకు సరఫరా చేస్తున్నారు. వీటితో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు.
కొత్తిమీరికి ..
ప్రస్తుతం చిలగడ దుంప ఒక బస్తా ధర రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు పలుకుతోంది. గతంలో ఇదే బస్తా రూ.1,500 నుంచి రూ.1,800 వరకు విక్రయమయ్యేదని రైతులు తెలిపారు. ధరలు తగ్గడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వంటల్లో విస్తృతంగా వినియోగించే కొత్తిమీరకు ప్రస్తుతం మంచి గిరాకీ ఉంది. ఒక కావిడి కొత్తిమీర ధర సుమారు రూ.800 పలుకుతోందని రైతులు చెబుతున్నారు.
క్యారెట్‌కు భలే డిమాండ్
ప్రస్తుతం క్యారెట్ ఒక క్రేట్ ధర రూ.400 నుంచి రూ.600 వరకు పలుకుతోంది. కావిడి ధర సుమారు రూ.వెయ్యి వరకు ఉంది. టమాటకు మాత్రం ప్రస్తుతం డిమాండ్ తక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. ఇక్కడ పండించే చిలగడ దుంపలకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. వీటిని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వ్యాపారుల వివరాల ప్రకారం, చిలగడ దుంపలను యూరియా, వ్యవసాయ రసాయనాల తయారీలోనూ వినియోగిస్తున్నారు.
విశాఖ మార్కెట్లకు భారీగా సరఫరా
ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు ఎగుమతి
క్యారెట్‌కు రూ.600 వరకు ధర
కొత్తిమీరకు పెరిగిన గిరాకీ
తగ్గిన చిలగడ దుంప ధరలతో ఆందోళన


