● కార్తీక దీపకాంతుల్లో శివాలయాలు
● జిల్లావ్యాప్తంగా పౌర్ణమి వేడుకలు
● భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
● జ్వాలాతోరణాలతో ఆధ్యాత్మిక శోభ
సాక్షి, పాడేరు: పవిత్ర కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన కార్తీక పౌర్ణమిని మంగళవారం జిల్లావ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. వేకువజాము నుంచే కుటుంబ సమేతంగా భక్తులు శివాలయాలకు తరలివెళ్లి శివపరమాత్మను దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు జిల్లాలోని ప్రముఖ, పురాతన శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.
మత్స్యగుండంలో..
పవిత్ర పుణ్యక్షేత్రం మత్స్యగుండంలోని మత్స్యలింగేశ్వరస్వామి, అరకులోయలో భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి, అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు, కాశీపట్నంలోని స్వయంభూ శివలింగంతో పాటు పాడేరులోని పురాతన స్వయంభూ ఉమానీలకంఠేశ్వరస్వామి, త్రిలింగేశ్వరస్వామి, గౌరీ నీలకంఠేశ్వరస్వామి, సోమనాథేశ్వర ఆలయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తుల సందడి నెలకొంది. లగిశపల్లి, గెడ్డంపుట్టు, వంజంగి, తామరపల్లి, వంతాడపల్లి శివాలయాల్లోనూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దేదీప్యమానంగా..
కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం వేళ శివాలయాలన్నీ దీపకాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోయాయి. మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకుని భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. దీపాల వెలుగులు, శివనామస్మరణతో ఆలయ ప్రాంగణాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉత్తర వాహిని మత్స్యగుండం సెలయేరులో మహిళలు పవిత్ర కార్తీక దీపాలను వదిలి భక్తిని చాటుకున్నారు. రాత్రి వరకు దీపోత్సవ సందడి కొనసాగింది. భక్తులు తమ నివాసాల వద్ద కూడా కార్తీక పౌర్ణమి పూజలు నిర్వహించారు. పాడేరు మండలంలోని మారుమూల సంగోడి శివాలయంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ రాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిజనులతో కలిసి కార్తీక దీపాలు వెలిగించారు.
వైభవంగా జ్వాలాతోరణాలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా పాడేరులోని ఉమానీలకంఠేశ్వరస్వామి, అరకులోయలోని భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి, సంగోడిలోని సిద్ధి సంగమేశ్వరస్వామి ఆలయాల్లో జ్వాలాతోరణాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. పాడేరు, అరకులోయ ఆలయాల్లో కమిటీ ప్రతినిధులు, భక్తులు జ్వాలాతోరణాలు వెలిగించగా, సంగోడిలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ పాల్గొన్నారు. అగ్నిజ్వాలల వెలుగులు, భక్తుల శివనామస్మరణతో ఆలయాల పరిసరాలు మార్మోగాయి.


