● గిరి రైతుకు అక్వాన్ తుపాను బెంగ
● పంటను కాపాడుకునేందుకు పరుగులు
● క్షణం తీరికలేకుండా కోతలు,నూర్పిళ్లల్లో నిమగ్నం
సాక్షి, పాడేరు: అక్వాన్ తుపాను ముప్పు గిరిజన రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయంలో తుపాను ముంచుకొస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రెండు రోజులుగా ఇళ్లను, ఇతర పనులను పక్కనపెట్టి పంట పొలాలే ఆవాసాలుగా చేసుకున్నారు. బుధవారం ఆకాశం మబ్బులు కమ్ముకోవడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. వర్షం మొదలైతే పంట నష్టపోతామనే భయంతో కోతలు కోసిన వరి పనలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నూర్పిడి యంత్రాలతో ధాన్యాన్ని వేరు చేస్తున్నారు. ఇప్పటికే నూర్పిడి చేసిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరికొందరు పొలాల్లోనే పనలు, ధాన్యాన్ని కాపాడుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. తుపాను ప్రభావంతో పంట చేతికి అందకుండా పోతుందేమోనన్న ఆందోళనతో గిరిజన రైతులంతా పొలాల వద్దే మకాం వేశారు. ఆకాశం వైపు చూస్తూ.. చేతికొచ్చిన పంటను కాపాడుకునేందుకు యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నారు.


