పాడేరు రూరల్: ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా గిరిజన రైతులకు ఎరువుల సేవలను మరింత సులభతరం చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్‌బీఎస్ ఆనంద్ తెలిపారు. బుధవారం వ్యవసాయ శాఖ సిబ్బందికి యాప్ వినియోగంపై అవగాహన కల్పించి, పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా ఎరువుల కోసం డీలర్ల దుకాణాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదన్నారు. నూతనంగా అందుబాటులోకి తెచ్చిన ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను ఉపయోగించి అవసరమైన ఎరువులను బుక్ చేసుకోవచ్చని వివరించారు. ఇకపై ఎరువుల దుకాణాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఉండదన్నారు. ప్రతి ఎరువుల దుకాణంలో రైతులకు సహాయం అందించేందుకు హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 11 మండలాల వ్యవసాయ అధికారుల నుంచి ఇద్దరు చొప్పున సిబ్బందిని, గ్రామ వ్యవసాయ సహాయకులను, ప్రైవేటు ఎరువుల డీలర్లను, రైతు సేవా కేంద్రాల సిబ్బందిని సమన్వయం చేసి యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. నవంబర్ 17 నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్ సేవలు ప్రారంభమయ్యాయని తెలిపారు. రైతులకు అవసరమైన సేవలను సమర్థంగా అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు వైవీ రమణ, సబ్ డివిజన్ ఏడీఏలు, ప్రైవేటు ఎరువుల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి నందు


