వంజంగి రోడ్డు మరమ్మతుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

వంజంగి రోడ్డు మరమ్మతుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం

Nov 18 2026 12:26 AM | Updated on Nov 18 2026 12:26 AM

పాడేరు రూరల్‌: ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన వంజంగి మేఘాల కొండకు వెళ్లే పర్వత రహదారి మరమ్మతులు చేపట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స విమర్శించారు. మంగళవారం సీపీఎం నాయకులు, గ్రామస్థులతో కలిసి ఆయన వంజంగి మేఘాల కొండ రహదారిని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో వచ్చిన అర్నాబ్‌ తుపాను కారణంగా రహదారి తీవ్రంగా దెబ్బతిని, పెద్దపెద్ద గోతులతో ప్రమాదకరంగా మారిందన్నారు. దీంతో పర్యాటకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ వెనుదిరుగుతున్నారని తెలిపారు. తుపాను వచ్చి నెల రోజులు కావస్తున్నా రహదారి మరమ్మతులకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మరోవైపు మేఘాల కొండపై పర్యాటక శాఖ పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు తీరిక లేకుండా పోయిందని విమర్శించారు. పర్యాటకం వల్ల ఆదివాసీ గిరిజనులకు ఆశించిన ప్రయోజనం కలగడం లేదని, వారి పేరుతో దోపిడీ సాగుతోందని ఆరోపించారు. వంజంగి కొండపై ఉన్న సుమారు ఏడు గ్రామాల్లో 200 కుటుంబాలు నివసిస్తున్నాయని, వివిధ అవసరాల కోసం రాకపోకలు సాగించేందుకు రహదారి దెబ్బతినడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆదివాసీలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ఆదివాసీలపై అటవీశాఖ ఆంక్షలు విధిస్తే ఉద్యమం

వంజంగి కొండపై నివసిస్తున్న ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయాలని అటవీశాఖ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అప్పలనర్స ఆరోపించారు. నిజంగానే ఆదివాసీలపై ఆంక్షలు విధిస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దశాబ్దాలుగా పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులను పర్యాటకం పేరుతో అటవీశాఖ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం భయాందోళనలకు గురిచేయడం సరికాదన్నారు. ఇప్పటికే ఆయా గ్రామాల గిరిజనులతో చర్చిస్తున్నామని, స్థానిక ఎన్నికల అనంతరం భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సుందర్‌రావు, నాయకులు దాసుబాబు, కొండబాబు, నాగేశ్వరరావు, రామారావు, నీలన్న, శ్రీను, పలువురు గిరిజనులు పాల్గొన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి అప్పలనర్స

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement