ఔషధ, సుగంధ మొక్కల సాగుకు ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

ఔషధ, సుగంధ మొక్కల సాగుకు ప్రోత్సాహం

Nov 18 2026 12:26 AM | Updated on Nov 18 2026 12:26 AM

● ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా ప్రత్యేకకార్యాచరణ

● ఏపీ ఎంఏపీ బోర్డు సీఈవో చంద్రశేఖర్‌

పాడేరు రూరల్‌: ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా ఔషధ, సుగంధ మొక్కల సాగును ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర ఏపీ ఎంఏపీ బోర్డు సీఈవో ఆవుత చంద్రశేఖర్‌ తెలిపారు. మంగళవారం ఏజెన్సీ పర్యటనలో భాగంగా పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ఔషధ, సుగంధ మొక్కల సాగుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. రైతులకు ఈ పంటల సాగుపై మరింత ప్రోత్సాహం అందిస్తామన్నారు. ఇందులో భాగంగా అల్లూరి, మన్యం, పార్వతీపురం, పోలవరం జిల్లాలను ఒక క్లస్టర్‌గా, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాలను మరో క్లస్టర్‌గా విభజించి, సాగుకు అనువైన భూములను గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆరోగ్యాంధ్ర లక్ష్య సాధనకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. పోషణ వాటికల ద్వారా పాఠశాల విద్యార్థులకు పౌష్టికాహారం అందించడంతో పాటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఔషధ, పోషక విలువలున్న మొక్కల పెంపకానికి అవసరమైన నిధులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఔషధ మొక్కల సాగు విస్తీర్ణం పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమన్వయం చేస్తున్నామన్నారు. ప్రధానంగా మునగ, చింత, సింధూర, తెల్లమద్ది, కరివేపాకు, లెమన్‌గ్రాస్‌, నేలవేప, నేల ఉసిరి, నల్లమిరియాలు, అడవి పసుపు, కలబంద తదితర ఔషధ, సుగంధ మొక్కల సాగుపై కార్యాచరణ సిద్ధం చేశామని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాచరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, సబ్‌ కలెక్టర్‌ సాహిత్‌, ఐటీడీఏ మేనేజర్‌ కుమారస్వామి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీధర్‌, వ్యవసాయ శాఖ అధికారి నందు, అటవీ శాఖ రేంజ్‌ అధికారి దేవిరాజేశ్వరి, డీఆర్డీఏ అధికారి జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement