చింతపల్లి: అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుపై ఎన్నికల సంఘం సుమోటోగా కేసు నమోదు చేయాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని చౌడుపల్లిలో సీపీఎం సర్పంచ్ అభ్యర్థి సాగిన చిరంజీవి నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కూటమి అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలవకపోతే ఆయా పంచాయతీలకు తమ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వబోమంటూ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని విమర్శించారు. ఇలాంటి వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాలు మారినప్పుడు ఇదే పరిస్థితి ఎదురైతే ఏమి చేస్తారని ప్రశ్నించారు. స్పీకర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు అతీతంగా చిన్నా, పెద్దా రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, బలహీన వర్గాలకు చెందిన అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుత పదవిలో ఉన్నవారు ఇలాంటి ప్రకటనలు చేయడం తగదన్నారు. పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల నిధులను జనాభా ప్రాతిపదికన కేటాయిస్తుందని, మా పార్టీ అధికారంలో ఉంటేనే నిధులు ఇస్తామనడం సరికాదని పేర్కొన్నారు. సీపీఎం మండల కార్యదర్శి పాంగి ధనుంజయ్, మండల కమిటీ సభ్యులు కిల్లో సింహాచలం, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఎన్నికల సంఘానికి చిన్నయ్యపడాల్ డిమాండ్
ప్రతిపక్ష అభ్యర్థులను భయపెట్టేలా వ్యాఖ్యలు
స్పీకర్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
పంచాయతీలకు నిధులపై
రాజకీయాలొద్దు


