చూడి గేదె సజీవ దహనం
రోలుగుంట: మండలంలోని మొకాస కొత్తపట్నం పంచాయతీ పరిధి చటర్జీపురం గ్రామానికి చెందిన కేదారి రాజబాబు పశువుల పాక వద్ద సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పశువుల పాక పూర్తిగా కాలి బూడిదవడంతో పాటు చూడి గేదె సజీవ దహనమైంది. ఎప్పటిలాగే సోమవారం రాత్రి తన పాకలో గేదెకు మేత వేసి ఇంటికి వెళ్లిపోయాడు. మంగళవారం తెల్లవారుజామున పాక వద్దకు వెళ్లి చూడగా, పూర్తిగా కాలిపోయి ఉండటంతోపాటు గేదె మృతి చెందింది. మరో పక్షం రోజుల్లో ఈనాల్సిన గేదె మృతి చెందడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. గేదె విలువ రూ.80 వేలు ఉంటుందని, తనకు ఇదే జీవనాధారమని బాధితుడు తెలిపాడు. ఎవరితోనూ శత్రుత్వం లేదని, పశువుల పాకకు మంటలు ఎలా అంటుకున్నాయో తెలియడం లేదని వాపోయాడు. అధికారులు పరిశీలించి పరిహారం అందించాలని కోరుతున్నాడు.


