జిల్లా విద్యా శాఖ అధికారి నాగేశ్వరరావు
కశింకోట: పాఠశాల దశ నుంచే విద్యార్థులు యోగా సాధన చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారి జి.వి.వి నాగేశ్వరరావు విద్యార్థులకు ఉద్బోధించారు. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూల్లో ఉమ్మడి విశాఖ జిల్లా స్థాయి యోగా పోటీలు మంగళవారం నిర్వహించారు. స్కూలు గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన పోటీలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ యోగా సాధన చేయడం వల్ల మానసిక ఉల్లాసం కలగడంతోపాటు చదువు పట్ల ఏకాగ్రత కలుగుతుందన్నారు. యోగా నిత్య జీవితంలో ఒక భాగం కావాలన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 230 మంది విద్యార్థులు యోగా పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంఈవో సురేష్, హెచ్ఎం ఎన్జెవి ప్రసాద్, ఎస్.జి.ఎఫ్ కార్యదర్శి కె.ఎం మనోహర్, అడ్మిన్ పి.కమల, పీడీ వి. ప్రభాకరరావు, శ్యాం, రాంకుమార్, దినకర్, యోగా కోచ్ శ్రీనివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.


