మన్యంపై చలి పంజా | - | Sakshi
Sakshi News home page

మన్యంపై చలి పంజా

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

సాక్షి,పాడేరు: మన్యంలో చలిగాలులు విజృంభిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ఏజెన్సీ ప్రజలు చలిపులి దెబ్బకు గజగజ వణుకుతున్నారు. గత ఐదు రోజులుగా జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, సోమవారం చలి తీవ్రత మరింత పెరిగింది. అరకులోయ కాఫీబోర్డు కేంద్రంలో 12 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 13.8 డిగ్రీలు, పాడేరు మండలం మినుములూరు కాఫీబోర్డు కేంద్రంలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో రాత్రి, వేకువజామున చలి తీవ్రత అధికంగా ఉంటోంది.

పొగమంచుతో సతమతం

జిల్లావ్యాప్తంగా అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు తొలగకపోవడంతో రహదారులపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొనడంతో వాహనదారులు లైట్ల వెలుతురులోనే ప్రయాణాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా ఘాట్‌ రహదారుల్లో పొగమంచు ప్రమాదకరంగా మారుతోంది. మలుపుల వద్ద దారి కనిపించక వాహనచోదకులు అప్రమత్తంగా ప్రయాణించాల్సి వస్తోంది.

సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలులు

గత మూడు రోజులుగా సాయంత్రం 4 గంటల నుంచే చలిగాలుల తీవ్రత పెరుగుతోంది. రాత్రి, వేకువజామున చలి మరింత ఎక్కువగా ఉంటోంది. దీంతో మన్యం ప్రజలతో పాటు ఏజెన్సీకి వచ్చే పర్యాటకులు చలిమంటలను ఆశ్రయించి వెచ్చదనం పొందుతున్నారు. పొగమంచు, చలిగాలుల ప్రభావంతో వారపు సంతలకు, వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు ప్రభావంతో కూరగాయలు ఇతరత్రా పంటలకు నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు సైతం చలికి అవస్థలు ఎదుర్కొంటున్నారు. సూర్యోదయం అయ్యే వరకు చలిగాలుల ప్రభావం కొనసాగుతోంది.

జోరందుకున్న ఉన్ని దుస్తుల అమ్మకాలు

చలి తీవ్రత పెరగడంతో జిల్లావ్యాప్తంగా ఉన్ని దుస్తులు, రగ్గులకు డిమాండ్‌ పెరిగింది. జిల్లా కేంద్రం పాడేరుతో పాటు పర్యాటక ప్రాంతాలైన అరకులోయ, చింతపల్లి, వివిధ వారపు సంతల్లో ఉన్ని దుస్తులు, రగ్గుల విక్రయాలు జోరందుకున్నాయి. అన్ని వర్గాల ప్రజలు తమ ఆర్థిక స్తోమతకు అనుగుణంగా చలి నుంచి రక్షణ పొందేందుకు ఉన్ని దుస్తుల కొనుగోలుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పర్యాటకులు సైతం చలిరగ్గులను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.

పడిపోతున్న ఉష్ణోగ్రతలు

చలిగాలులు ఉధృతం

దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచు

వణుకుతున్న గిరిజనులు

అరకులోయ 12 డిగ్రీలు, చింతపల్లి 13.8 డిగ్రీలు, మినుములూరు 14డిగ్రీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement