ఆదివాసీ హక్కుల పరిరక్షణకు పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ హక్కుల పరిరక్షణకు పోరాటాలు

Nov 17 2026 1:08 AM | Updated on Nov 17 2026 1:08 AM

● బిర్సాముండాకు ఘననివాళి

● ఎన్నికల హామీలను విస్మరించినచంద్రబాబు

● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

పాడేరు: బిర్సాముండా పోరాట స్ఫూర్తితో ఆదివాసీ హక్కులు, చట్టాల పరిరక్షణ కోసం శాంతియుత పోరాటాలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. బిర్సాముండా 151వ జయంతి వేడుకలను సోమవారం పాడేరు మండలం చింతలవీధి వై. జంక్షన్‌ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బిర్సాముండా నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

గిరిజన హక్కులను కాలరాస్తున్న

చంద్రబాబు ప్రభుత్వం

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు గిరిజనులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రెండున్నరేళ్ల పాలనలో గిరిజన చట్టాలు, హక్కులను తుంగలో తొక్కిందని, ఆదివాసీలకు నష్టం చేకూర్చే పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. కార్పొరేట్‌ కంపెనీలకు కొమ్ముకాస్తూ ఏజెన్సీలోని సహజ సంపదను వారికి ధారాదత్తం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిందన్నారు.

కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలి

కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలకు గిరిజనులు తమ ఓటు ద్వారా తగిన బుద్ధి చెబుతున్నారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి ప్రజలు గట్టి ఎదురుదెబ్బ తీశారన్నారు. ఓటమిని జీర్ణించుకోలేక సీఎం చంద్రబాబు ఆదివాసీ ప్రాంతంపై, గిరిజనులపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. గిరిజనులు తమ అనుభవాలు, ప్రాంత అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఓటు వేశారని తెలిపారు. రానున్న రోజుల్లో జరగనున్న గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ఎన్నికల్లోనూ టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతుదారులను ఓడించి కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజాతీర్పును గౌరవించి సీఎం చంద్రబాబు తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కిల్లో సురేంద్ర, కె.లోకనాథం, ముంచంగిపుట్టు జెడ్పీటీసీ సభ్యుడు కొర్రా త్రినాథ్‌, నాయకులు ఉమామహేశ్వరరావు, పోతురాజు, చిన్నయ్యపడాల్‌, గంగరాజు, దాస్‌, కార్తీక్‌, జీవన్‌, హైమావతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement