చింతపల్లి: అల్లూరి జిల్లాలో జిల్లా పరిషత్, మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికకు అన్ని ఏర్పాట్టు పూర్తి చేసినట్టు జెడ్పీ సీఈవో వాసుదేవరావు తెలిపారు. చింతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, సహయ ప్రిసైడింగ్ అధికారులతో ఆయన సోమవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 19న ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికతో పాటు కో–ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, 20న జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికతో పాటు కో ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక జరుగుతుందన్నారు. ఈ మేరకు ఈనెల 19న ఉదయం 10 గంటలలోపు కో–ఆప్టెడ్ సభ్యులు నామినేషన్ దాఖలు చేయాలని, 12 గంటలలోగా నామినేషన్ల పరిశీలన, ఒంటి గంటలోగా ఉపసంహరణ జరుగుతుందన్నారు. ఒంటి గంట తర్వాత ఎంపీటీసిలు ప్రమాణ స్వీకారం జరుగుతుందన్నారు. అనంతరం కో–ఆప్టెడ్ సభ్యుడి ఎన్నిక చేతులెత్తే పద్ధతిలో ఉంటుందని పేర్కొన్నారు. అదే విధంగా ఎంపీపీ ఎన్నిక మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంపీపీగా పోటీ చేసే అభ్యర్థికి ఒక ఎంపిటీసి ప్రతిపాదించగా మరోక ఎంపీటీసీ మద్దతు ప్రకటించాల్సి ఉందన్నారు. ఎంపీపీ అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే లాటరీ పద్దతిని పాటించి ఫలితాలను ప్రకటించడం జరుగుతుందన్నారు.ఇదే పద్దతిని ఉపాధ్యక్ష ఎన్నిక కూడా కొనసాగుతుందన్నారు.ఈ ఎన్నిక ప్రక్రియ కోసం కచ్చితంగా కోరం ఉండాలన్నారు.
ఈనెల 20న పాడేరు జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికతో పాటు కో–ఆప్టెడ్ సభ్యుని ఎన్నిక నిర్వహించనున్నట్టు చెప్పారు. ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జిల్లా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌గా ప్రతి పాదించే వ్యక్తులు ముందురోజే ఆయా ప్రిసైడింగ్ అదికారులకు ఫారం ఏ,బిలు సమర్పించాలన్నారు. విప్ జారీ చేసేందుకు ఎనెగ్జర్ 12ను ఎకనాలెడ్జెమెంటును ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలన్నారు. ఈ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ఖచ్చితంగా ఎన్నికలు నిబందనలను పాటించాలన్నారు. ఎంపీడీవో లాలం సీతయ్య పాల్గొన్నారు.


