గూడెంకొత్తవీధి: జిల్లాలో మొదటి విడతలో పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలకు అభ్యర్థుల నామినేషన్లు కోలాహలం కొనసాగుతోంది. రెండో రోజు సోమవారం ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇందులో భాగంగా మండలంలోని దామణాపల్లి పంచాయతీ నుంచి వైఎస్సార్‌సీపీ మద్దతుతో కుందేరి సత్యవతి నామినేషన్ వేశారు. గూడెం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ మద్దతుతో కొర్రా బాబీ నామినేషన్ దాఖలు చేశారు. మండలంలో సోమవారం సర్పంచ్ పదువులకు–50, వార్డు సభ్యులకు–54 నామినేషన్లు వచ్చినట్టు ఎంపీడీవో రమణబాబు తెలిపారు. మొత్తం 104 నామినేషన్లు స్వీకరించినట్టు చెప్పారు.
కొయ్యూరులో 319 నామినేషన్ల దాఖలు
కొయ్యూరు: మండలంలో 33 పంచాయతీల నుంచి సర్పంచ్ పదువులకు–94, వార్డు సభ్యులకు–225 నామినేషన్లు వచ్చినట్టు ఎంపీడీవో ప్రసాదరావు సోమవారం రాత్రి తెలిపారు. మొత్తంగా సర్పంచ్, వార్డు సభ్యులకు కలిసి 319 నామినేషన్లు దాఖలైనట్టు పేర్కొన్నారు. రాజేంద్రపాలెం పంచాయతీలో వైఎస్సార్‌సీపీ మద్దతులో నర్సి కృష్ణ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రజలు అధికంగా తరలివచ్చారు.
సీలేరు: సీలేరులోని సచివాలయంలో ఏర్పాటుచేసిన రెండు నామినేషన్ కేంద్రాల్లో సోమవారం గుమ్మిరేవుల సర్పంచ్ పదవులకు – 4, వార్డు మెంబర్లకు–4, దారకొండ సర్పంచ్ పదవులకు–4, వార్డు మెంబర్లకు–9, దుప్పలవాడ వార్డు మెంబర్లకు–8, సీలేరులో సర్పంచ్ పదువులకు–2 నామినేషన్ పత్రాలు దాఖలైనట్టు ఎన్నికల అధికారులు కృష్ణారావు, పడాలు తెలిపారు. సీలేరు పరిధిలోని సర్పంచ్, వార్డు సభ్యుల పదవులకు మొత్తం 29 నామినేషన్లు దాఖలైనట్టు చెప్పారు.
చింతపల్లి: మండలంలో పంచాయతీ ఎన్నికలకు 97 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలుచేసినట్టు ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. మండలంలో 17 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు తొలిరోజు 15 నామినేషన్‌లు దాఖలు కాగా రెండవ రోజు 251 నామినేషన్‌లు దాఖలైనట్టు ఆయన చెప్పారు. రెండవ రోజు సర్పంచ్ పోటీలో బెన్నవరం పంచాయతీలో–7, కుడుముసారిలో–4, లోతుగెడ్డలో–2, లంబసింగిలో–9, పెదబరడలో–6, అన్నవరంలో–6, తమ్మెంగులులో–3, కొత్తపాలెంలో– 5, గొందిపాకలులో–5, చింతపల్లిలో–7, అంజలి శనివారంలో–3, తాజంగిలో–6, చౌడుపల్లిలో–5, కిటుములులో–2, బలపంలో–6, కొమ్మంగిలో–4, ఎర్రబొమ్మలు పంచాయతీలో–4 నామినేషన్‌లు దాఖలైనట్టు పేర్కొన్నారు.అదే విధంగా 17 పంచాయతీల నుంచి 167 మంది రెండవ రోజు వార్డు సభ్యులుగా నామినేషన్‌లు దాఖలు చేసినట్టు ఎంపీడీవో తెలిపారు.


