డుంబ్రిగుడ: విశాఖపట్నానికి చెందిన వైజాగ్ పెడల్ ప్లస్ సైక్లిస్టుల బృందం చేపట్టిన అరకు ఎపిక్ రైడ్ ఆదివారం రాత్రి అరకు పైనరీకి చేరుకుంది. ముగింపు కేంద్రానికి చేరుకున్న సుమారు 20 మంది సైక్లిస్టులకు పాడేరు డీఎఫ్వో కె.ఉమామహేశ్వరి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారితో కలిసి ‘గంజాయికి నో చెప్పండి’ అనే కరపత్రాలను ప్రదర్శించారు. గంజాయి వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. గంజాయిని సాగు, వినియోగించడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతంలోని ప్రకృతి అందాలు, కొండ ప్రాంతాల్లోని కాఫీ, మిరియాల తోటలు, స్థానిక గిరిజన సంస్కృతిని ఆస్వాదిస్తూ రైడ్ సాగినట్టు సైక్లిస్టులు తెలిపారు.అనంతరం సైక్లిస్టులకు అరకు పైనరీలోని నేచర్ క్యాంపులో బస ఏర్పాటు చేశారు. అరకు అటవీశాఖ రేంజర్ కోటేశ్వరరావు, పైనరీ మేనేజర్ చంద్రశేఖర్, వీఎస్ఎస్ సభ్యురాలు భారతి తదితరులు పాల్గొన్నారు.
స్వాగతం పలికిన డీఎఫ్వో ఉమామహేశ్వరి


