నక్కపల్లి/పాయకరావుపేట: పాయకరావుపేట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎంపిక టీడీపీలో వివాదానికి దారితీసింది. బీసీలకు రిజర్వ్ అయిన ఈ పదవికి పెంకే గోవిందు, జూరెడ్డి ప్రసాద్ పోటీ పడుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, హోంమంత్రి వంగలపూడి అనిత జూరెడ్డి ప్రసాద్‌కు మద్దతు తెలపడంతో మరో వర్గంలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
పట్టణంలో సుమారు రెండు వేల ఓట్లున్న శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన పెంకే గోవిందును అభ్యర్థిగా ప్రకటించాలని ఆ వర్గీయులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్న జూరెడ్డి ప్రసాద్‌కు సీనియర్ నేతలు పెదిరెడ్డి చిట్టిబాబు, యాళ్ల వరహాలు, పెదిరెడ్డి శ్రీను, మజ్జూరి నారాయణరావుతోపాటు జనసేన నాయకుడు తోట నగేష్ మద్దతు పలుకుతున్నారు.
గోవిందు సతీమణి ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలుపొందడంతో ఒకే కుటుంబానికి రెండు పదవులు ఇవ్వకూడదన్న ఉద్దేశంతో ఆయన పేరును పక్కనపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శెట్టిబలిజ వర్గీయులు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ గోవిందు కూడా సర్పంచ్‌గా పోటీ చేస్తారని ప్రకటిస్తున్నారు.
మరోవైపు కేవలం ఓట్ల సంఖ్య ఆధారంగా అభ్యర్థిత్వాన్ని నిర్ణయించలేమని, పార్టీ కోసం పనిచేసిన అనుభవం, సీనియారిటీ, ఇతర సామాజిక సమీకరణాలనూ పరిగణనలోకి తీసుకోవాలని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. దేవాంగ సామాజికవర్గానికి కూడా ఈసారి అవకాశం కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటంతో అభ్యర్థి ఎంపిక టీడీపీ నాయకత్వానికి సవాలుగా మారింది. జూరెడ్డి ప్రసాద్‌తో నామినేషన్ వేయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పెంకే గోవిందు రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారా? లేక పార్టీ నిర్ణయానికి కట్టుబడి పోటీ నుంచి తప్పుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది. సామాజికవర్గ ఒత్తిళ్లకు మంత్రి అనిత తలొగ్గుతారా? లేక పార్టీ నిర్ణయానికే కట్టుబడతారా? అన్న చర్చ పట్టణంలో సాగుతోంది.


