చల్లని కొండల్లో.. కాసుల పంట | - | Sakshi
Sakshi News home page

చల్లని కొండల్లో.. కాసుల పంట

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

చల్లటి వాతావరణం.. ప్రకృతి అందాల నడుమ ఎర్రని రంగులో కనువిందు చేస్తున్న స్ట్రాబెర్రీ పండ్లు మన్యం రైతులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. పదేళ్లుగా సాగవుతున్న ఈ విదేశీ పంటకు ఈ ఏడాది వాతావరణం కూడా కలిసిరావడంతో ముందస్తుగానే దిగుబడులు ప్రారంభమయ్యాయి. లంబసింగి, అరకులోయ ప్రాంతాల్లో 40 ఎకరాల్లో సాగవుతున్న స్ట్రాబెర్రీలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఏర్పడింది. పర్యాటకుల కొనుగోళ్లతో పాటు మైదాన ప్రాంతాలకు ఎగుమతులు ఊపందుకోవడంతో గిరిజన రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.

సాక్షి, పాడేరు: విదేశీ పంట స్ట్రాబెర్రీ మన్యం రైతులకు ఏటా సిరులు కురిపిస్తోంది. చల్లటి వాతావరణ పరిస్థితులు చింతపల్లి, అరకులోయ ప్రాంతాల్లో ఈ పంట సాగుకు అనుకూలంగా ఉండడంతో గత పదేళ్లుగా రైతులు స్ట్రాబెర్రీ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది కూడా వాతావరణం అనుకూలించడంతో ముందస్తుగానే పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. దీంతో తోటల వద్ద విక్రయాలు జోరందుకున్నాయి.

విస్తరిస్తున్న సాగు

మన్యంలో పండుతున్న స్ట్రాబెర్రీ పండ్లకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్‌ ఉంది. అతి శీతల ప్రాంతంగా పేరొందిన చింతపల్లి మండలంలోని ఆంధ్రా కశ్మీర్‌ లంబసింగిలో 30 ఎకరాలు, ఆంధ్రా ఊటీ అరకులోయ ప్రాంతంలో మరో 10 ఎకరాల్లో ఈ ఏడాది పంట సాగు చేస్తున్నారు. గిరిజన రైతులు, వ్యాపారుల భాగస్వామ్యంతో చేపడుతున్న సాగులో ఈసారి ముందస్తుగానే పూత, కాపు ఏర్పడింది.

కొనుగోళ్ల జోరు

అనుకూల వాతావరణంతో అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో స్ట్రాబెర్రీ దిగుబడులు ప్రారంభమయ్యా యి. ఈ సీజన్‌లో పర్యాటకులు నేరుగా తోటలకు వెళ్లి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతు ల్లో, ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం లేకుండా పండిస్తున్న స్ట్రాబెర్రీలు రుచిలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. విదేశీ పంట సాగుతో మన్యం ప్రాంతానికి మరింత గుర్తింపు లభిస్తోంది.

200 గ్రాముల బాక్సు రూ.100

అరకులోయ, లంబసింగి ప్రాంతాల్లో రైతులు, వ్యాపారులు 200 గ్రాముల స్ట్రాబెర్రీ పండ్ల బాక్సును రూ.100కు విక్రయిస్తున్నారు. లంబసింగి నుంచి ప్రతిరోజూ భారీగా పండ్లను తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపారం జోరుగా సాగుతుండగా, వచ్చే ఏడాది మార్చి వరకు దిగుబడులు కొనసాగుతాయని రైతులు చెబుతున్నారు.

సాగుపై పెరుగుతున్న ఆసక్తి

స్ట్రాబెర్రీ సాగు రైతులకు ఏటా లాభదాయకంగా మారుతోంది. సీజన్‌ ప్రారంభం నుంచి ముగిసే వరకు ఎకరాకు సుమారు 4 వేల కిలోల దిగుబడి వస్తుందని ఉద్యానవనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఎకరా సాగుకు దాదాపు రూ.2 లక్షల పెట్టుబడి అవుతోంది. పెట్టుబడి, కూలీల ఖర్చులు పోను మరో రూ.2 లక్షల వరకు ఆదాయం లభిస్తుండడంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారు.

40 ఎకరాల్లో స్ట్రాబెర్రీ సాగు

ముందస్తుగా దిగుబడులు ప్రారంభం

తెలుగు రాష్ట్రాల్లో భారీ డిమాండ్‌

పర్యాటకుల కొనుగోళ్లతో సందడి

200 గ్రాముల బాక్సు రూ.100

మార్చి వరకు ఫలసాయం

ఎకరాకు రూ.2 లక్షల ఆదాయం

సేంద్రియ సాగుతో ప్రత్యేక గుర్తింపు

అనుకూలంతో ముందస్తు పంట

ఈ ఏడాది స్ట్రాబెర్రీ పంటకు వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో ముందస్తుగానే పూత వచ్చింది. ప్రస్తుతం పండ్ల దిగుబడులు ప్రారంభమయ్యాయి. స్థానికంగా రోజువారీ విక్రయాలతో పాటు మైదాన ప్రాంతాలకు కూడా పండ్లను తరలిస్తున్నాం. ఈ ఏడాది కూడా స్ట్రాబెర్రీ సాగుతో మంచి లాభాలు వస్తాయని ఆశిస్తున్నాం.

– కె.సత్యనారాయణ, రైతు, లంబసింగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement