నామినేషన్‌ ఫారాలే పెద్ద పరీక్ష! | - | Sakshi
Sakshi News home page

నామినేషన్‌ ఫారాలే పెద్ద పరీక్ష!

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

● 12 పేజీల ఫారంతో అభ్యర్థుల అవస్థలు

● నింపేందుకే సగం రోజు!

● బరిలో దిగకముందే నామినేషన్‌ కష్టాలు

● తొలిరోజు నామినేషన్లకు అంతంత స్పందన

కొయ్యూరు: ఎన్నికల బరిలో నిలవాలంటే అభ్యర్థులకు నామినేషన్‌ కష్టాలు తప్పడం లేదు. ఏకంగా 12 పేజీలతో కూడిన నామినేషన్‌ పత్రాలను పూర్తి చేసేందుకు అభ్యర్థులు అపసోపాలు పడుతున్నారు. అందులో పేర్కొన్న వివరాలను నమోదు చేయడంతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను జత చేయాల్సి ఉండటంతో గంటల సమయం పడుతోంది. ఉదయం నామినేషన్‌ కేంద్రాలకు వచ్చిన అభ్యర్థులు మధ్యాహ్నం వరకు ఫారాలు నింపుతూనే ఉంటున్నారు. ఈ ప్రక్రియలో సమయం ఎక్కువగా పడుతుండటంతో ఆదివారం తొలిరోజు పలు కేంద్రాల్లో ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. అభ్యర్థులు ఫారాలను తీసుకెళ్లి అవసరమైన వివరాలు నింపుకుని, ధ్రువపత్రాలు సిద్ధం చేసుకుంటున్నారు. సోమవారం కార్తీక సోమవారం కావడంతో పలువురు అభ్యర్థులు అదే రోజు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

మొదటి రోజు పది నామినేషన్లు

సర్పంచ్‌లకు సంబంధించి ఆరు,వార్డు సభ్యులకు సంబంధించి నాలుగు కలిసి మొత్తం పది నామినేషన్లను ఆదివారం దాఖలు చేశారని ఎంపీడీవో ప్రసాదరావు ఆదివారం సాయంత్రం తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్ల స్వీకరణ జరిగిందన్నారు.

నామినేషన్‌ కేంద్రాల పరిశీలన

నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను ఎంపీడీవో జీడీవీ ప్రసాదరావు, తహసీల్దార్‌ ప్రసాదరావు ఆదివారం పరిశీలించారు. కొయ్యూరు, రాజేంద్రపాలెంలోని నామినేషన్‌ స్వీకరణ క్లస్టర్లను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్‌ పత్రాలు నింపే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని ఆదేశించారు.

చింతపల్లి: మండలంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలిరోజు 15 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో లాలం సీతయ్య తెలిపారు. మండలంలోని 17 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో తొలిరోజు అన్నవరం నుంచి 1, బలపం నుంచి 3, చింతపల్లి నుంచి 3, కిటుముల నుంచి 1, లోతుగెడ్డ నుంచి 2, పెదబరడ నుంచి 3, తాజంగి నుంచి 1, ఎర్రబొమ్మల నుంచి 1 నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఐదు పంచాయతీల పరిధిలోని వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి 9 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీవో వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement