మంచు దుప్పట్లో మన్యం | - | Sakshi
Sakshi News home page

మంచు దుప్పట్లో మన్యం

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

ముంచంగిపుట్టులో కురుస్తున్న మంచు

మంట కాగుతున్న గిరిజనులు

ముంచంగిపుట్టు: మన్యం గ్రామాలను మంచు మేఘాలు కమ్మేస్తున్నాయి. తెల్లవారుజామున ప్రకృతి అందాలు కనువిందు చేస్తున్నా.. చలి మాత్రం ప్రజలకు వణుకు పుట్టిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న చలి తీవ్రతతో గిరిజన గ్రామాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచే మొదలవుతున్న చలి.. మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు కొనసాగుతోంది. దట్టమైన మంచు కారణంగా రహదారులు సైతం కనిపించని పరిస్థితి నెలకొంటోంది. వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణిస్తున్నారు. రోజువారీ పనుల కోసం బయటకు వెళ్లే కూలీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు చలికి గజగజ వణుకుతున్నారు.నీటి కోసం బిందెలతో బయలుదేరే గిరిజన మహిళలు, పనులకు వెళ్లే కూలీలు మంచు తెరలను చీల్చుకుంటూ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు గ్రామాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.

పెరిగిన పర్యాటకుల తాకిడి

చింతపల్లి: ప్రముఖ పర్యాటక కేంద్రమైన లంబసింగికి పర్యాటకుల తాకిడి పెరిగింది. ఆదివారం తెల్లవారుజాము నుంచే మైదాన ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ఇటీవల ఈ ప్రాంతంలో మంచు తీవ్రత పెరగడంతో పాటు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు.చెరువులవేనం వ్యూ పాయింట్‌ వద్ద పాల సముద్రాన్ని తలపించే మంచు అందాలు పర్యాటకులను కట్టిపడేశాయి. మంచు తెరల మధ్య సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ కుటుంబ సభ్యులతో సందడి చేశారు. మరోవైపు తాజంగి జలాశయం వద్ద ఏర్పాటు చేసిన జిప్‌లైన్‌, బోటు షికారు వంటి సాహస క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. దీంతో లంబసింగి, తాజంగి, భీమనాపల్లి ప్రాంతాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటకుల సందడితో కళకళలాడాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement