హీటర్లు ఉన్నా.. చన్నీళ్ల స్నానమే! | - | Sakshi
Sakshi News home page

హీటర్లు ఉన్నా.. చన్నీళ్ల స్నానమే!

Nov 16 2026 12:38 AM | Updated on Nov 16 2026 12:38 AM

● ఆశ్రమ పాఠశాలల్లో పనిచేయనివాటర్‌ హీటర్లు

● చలికి వణుకుతున్న విద్యార్థులు

ముంచంగిపుట్టు: గజగజ వణికించే చలి.. ఆపై చన్నీటి స్నానాలు.. వెరసి గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. శీతాకాలంలో వేడి నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన సోలార్‌ వాటర్‌ హీటర్లు మరమ్మతులకు గురై మూలకు చేరాయి. ఫలితంగా తెల్లవారుజామున చల్లటి నీటితో స్నానాలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. చన్నీటి స్నానాలతో జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్న విద్యార్థులు చదువుపై సరిగ్గా దృష్టి సారించలేకపోతున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన పరికరాలు నిరుపయోగంగా మారినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

121 పాఠశాలల్లో 36 వేల మంది విద్యార్థులు

జిల్లాలోని 11 మండలాల్లో 121 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 36 వేల మంది విద్యార్థులు వసతి పొందుతూ చదువుకుంటున్నారు. ప్రతి మండలంలో 10 నుంచి 14 వరకు ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. విద్యార్థులకు వేడి నీటి స్నానాల సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో గతంలో ఐటీడీఏ అధికారులు ఒక్కో పాఠశాలకు రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఖర్చు చేసి సుమారు 102 పాఠశాలల్లో సోలార్‌ వాటర్‌ హీటర్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యార్థులకు వేడి నీరు అందుబాటులో ఉండేది. అయితే గత కొన్నేళ్లుగా నిర్వహణ లోపంతో భవనాలపై ఏర్పాటు చేసిన సోలార్‌ హీటర్లు పనిచేయకుండా పోయాయి.

చన్నీటితో అనారోగ్య సమస్యలు

నవంబర్‌ నుంచి జనవరి వరకు మన్యంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు ఉదయం నిద్రలేచిన వెంటనే చల్లటి నీటితో స్నానాలు చేయాల్సి వస్తోంది. అధికశాతం వసతి గృహాల నిర్వాహకులు వేడి నీటిని సరఫరా చేయకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. చన్నీటి స్నానాలతో కొందరు జలుబు, దగ్గు, జ్వరాల బారిన పడుతున్నారు. మరికొందరు స్నానం చేసిన వెంటనే చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. అనారోగ్య సమస్యలతో విద్యార్థులు తరగతులపై దృష్టి సారించలేకపోతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరమ్మతులు చేయించాలి

ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు చలితో పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారులు గుర్తించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. నిరుపయోగంగా ఉన్న సోలార్‌ వాటర్‌ హీటర్లకు తక్షణమే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరమ్మతులు సాధ్యం కాని చోట్ల వసతి గృహాల నిర్వాహకుల ద్వారా వేడి నీటిని సరఫరా చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నారు. శీతాకాలం ముగిసే వరకు విద్యార్థులకు వేడి నీటి సౌకర్యం కల్పించి చన్నీటి స్నానాల కష్టాల నుంచి విముక్తి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement