కొయ్యూరు: జిల్లా పరిషత్ సీఈవో వాసుదేవరావు ఆదివారం మండలంలోని శరభన్నపాలెం, నడింపాలెం, రావణాపల్లి నామినేషన్ క్లస్టర్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్ప్‌డెస్క్ ద్వారా అభ్యర్థులకు అందిస్తున్న సేవలను తనిఖీ చేశారు. రిటర్నింగ్ అధికారులతో మాట్లాడి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. నామినేషన్ల స్వీకరణ నుంచి అభ్యర్థుల ఉపసంహరణ, ఎన్నికల గుర్తుల కేటాయింపు వరకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఎలాంటి వివాదాలకు తావులేకుండా నిబంధనల ప్రకారం నామినేషన్లను స్వీకరించాలని సిబ్బందికి సూచించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో ప్రసాదరావు, ఇతర సిబ్బంది ఉన్నారు.


