ఇళ్ల పెరట్లోనే పాదులు
డుంబ్రిగుడ: సాధారణంగా ద్రాక్ష తోటలు సాగు భూముల్లో కనిపిస్తాయి. కానీ డుంబ్రిగుడ గిరిజనుల ఇళ్ల పెరళ్లే ఇప్పుడు ద్రాక్ష తోటలను తలపిస్తున్నాయి. ఇంటి గోడలు, చుట్టూ ఉన్న ప్రదేశాలను అల్లుకుంటూ పెరిగిన తీగలకు నల్లని ద్రాక్ష గుత్తులు కాయడంతో ఆ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మండల కేంద్రానికి చెందిన విలియం కేరి, ఎ.రాజు ఇళ్ల వద్ద ద్రాక్ష తీగలు విస్తరించి కాపునకు వచ్చాయి. మరోవైపు భీమరాజు ఇంటి ఆవరణలో తమలపాకు తీగలు అల్లుకున్నాయి. గత మూడేళ్లుగా తమ ఇంటి వద్ద నల్లటి ద్రాక్ష పండ్లు కాస్తున్నాయని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాపు ప్రారంభం కాగా, పూర్తిస్థాయిలో పండ్లు అందుబాటులోకి వస్తే చిన్నారులకు పంచిపెడతామని చెబుతున్నారు. ఇంటి పెరట్లోనే పండ్ల తోటలు కళకళలాడుతుండటంతో స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.


