● కలెక్టర్ నిశాంతి
● మనమిత్ర సేవలపై ప్రకటన
పాడేరు రూరల్: వాట్సాప్ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. మనమిత్ర వాట్సాప్ సేవల ద్వారా ప్రజలకు మరింత సులభతరమైన ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామన్నారు. వివిధ ప్రభుత్వ సేవలను ఇకపై ఇంటి వద్ద నుంచే పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు అందించే ఫిర్యాదుల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రత్యేక సదుపాయం కల్పిస్తున్నామని తెలిపారు. ప్రజలకు సులభతరంగా, పారదర్శకంగా సేవలు అందించడంతో పాటు సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నూతన విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. మనమిత్ర వాట్సాప్ సేవల్లో అందుబాటులో ఉన్న సేవల జాబితా నుంచి తమకు అవసరమైన సేవలను ఎంపిక చేసుకోవచ్చని వివరించారు. వివిధ ప్రభుత్వ సేవలు, సమాచారానికి సంబంధించిన వివరాలు వాట్సాప్‌లో పొందుపరిచామని, అవసరమైన సమాచారాన్ని ఎంపిక చేసుకుని తెలుసుకోవచ్చన్నారు. అర్హులైన ప్రజలందరూ మనమిత్ర వాట్సాప్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.


