నాతవరం: దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు కొండల మధ్య ఎత్తైన ప్రదేశం నుంచి జాలువారే జలధారలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. డలంలోని ఏజెన్సీ ప్రాంతమైన సరుగుడు గ్రామ సమీపంలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులకు, పిక్నిక్‌లకు విడిది కేంద్రంగా మారింది. కార్తీకమాసం ప్రారంభం కావడంతో అధిక సంఖ్యలో సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో ఈ ప్రాంతమంతా సందడిగా మారుతోంది. సందర్శకులకు ఇబ్బందులు కలగకుండా గతంలో పర్యాటక శాఖ అధికారులు రూ.10 లక్షలతో షెడ్డు నిర్మించారు. కొండపై నుంచి జాలువారే జలపాతం వద్దకు వెళ్లేందుకు వీలుగా మెట్లతో పాటు ఇబ్బందులు లేకుండా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. జలపాతం దిగువ ప్రాంతంలోని కొండపై వినాయకుడు, పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలతో పాటు నంది విగ్రహం, శివలింగాన్ని ఏర్పాటు చేశారు. కార్తీకమాసంలో భక్తులు జలపాతంలో పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం శివలింగంతో పాటు ఇతర దేవతామూర్తులను దర్శించుకుంటారు. ఈ జలపాతం నర్సీపట్నం నుంచి సరుగుడు గ్రామం మీదుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. నర్సీపట్నం నుంచి ఉదయం, సాయంత్రం సరుగుడు గ్రామం వరకు నిత్యం ఆటోలు తిరుగుతుంటాయి.
అయ్యన్న హామీ నెరవేరేదెప్పుడు?
స్పీకర్ అయ్యన్నపాత్రుడు సరుగుడు జలపాతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని 2024 నవంబర్ 24న సుందరకోటలో జరిగిన సభలో హామీ ఇచ్చారు. పర్యాటక శాఖ అధికారులతో మాట్లాడి సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తానని ప్రకటించారు. అయితే హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ అది కార్యరూపం దాల్చలేదు. సరుగుడు జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఈ ప్రాంత గిరిజనులకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి జలపాతం అభివృద్ధిపై దృష్టి సారించాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు.


