సీతంపేట: ఆంధ్రప్రదేశ్ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ కంపెనీ మేనేజింగ్ కమిటీ(సీఎంసీ) సమావేశం ఈపీ డిస్కం అధ్యక్షుడు కె.సత్యప్రసాద్ అధ్యక్షతన శంకరమఠం రోడ్డులోని ఒక హోటల్‌లో ఆదివారం జరిగింది. ఏపీపీడీఈఏ ప్రధాన కార్యదర్శి జి.జోగినాయుడు 2025–26 పదవీ కాలంలో ఈపీ డిస్కం యూనిట్ చేపట్టిన కార్యకలాపాలు, సభ్య ఇంజినీర్ల సమస్యల పరిష్కారం కోసం చేసిన కృషిని వివరించారు. అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఇంజినీర్ పి.సన్యాసిరావు రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్ కార్యకలాపాలను తెలియజేశారు. క్షేత్రస్థాయి ఇంజినీర్లపై పనిభారాన్ని తగ్గించేందుకు కొత్త సెక్షన్ల ఏర్పాటు, కొత్త పోస్టుల మంజూరు, జేఈల పే స్కేళ్ల సవరణ, క్యాష్‌లెస్, అపరిమిత వైద్య సదుపాయం అమలు, గ్రాడ్యుయేట్ జేఈలను ఏఈలుగా ప్రమోషన్, 1999 నుంచి 2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తరహాలో ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మార్పు చేయాలని తీర్మానించారు. అనంతరం 2027–28 పదవీ కాలానికి ఏపీపీడీఈఏ నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్షుడిగా కె.సత్యప్రసాద్, ఉపాధ్యక్షుడిగా పి.రామరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి.జోగినాయుడు, సహాయ ప్రధాన కార్యదర్శిగా జి.ఎస్.ఎన్.పట్నాయక్, సలహాదారుగా వి.రవిశంకర్, సంయుక్త కార్యదర్శులుగా ఎస్.డి.మక్బుల్ అహ్మద్, పి.కాశిబాబు, టి.రాజ్‌కుమార్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను ట్రస్ట్ చైర్మన్ వి.వి.మహేశ్వరరెడ్డి, రాష్ట్ర సలహాదారు ఎ.సుబ్బారావు అభినందించి.. అసోసియేషన్ లక్ష్యాల సాధనకు సూచనలిచ్చారు.


