జలధారల జాతర | - | Sakshi
Sakshi News home page

జలధారల జాతర

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

కొండల మధ్య డుడుమ జలపాత సోయగం

ముంచంగిపుట్టు: ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో పర్యాటక సీజన్‌ ప్రారంభమైంది. ఏటా నవంబర్‌ నుంచి జనవరి వరకు ఈ ప్రాంతంలోని ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. కొండకోనల మధ్య నుంచి జాలువారే జలపాతాలు, మంచు తెరలు, పచ్చని ప్రకృతి అందాలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది.

● ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని డుడుమ జలపాతం సుమారు 558 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతూ కనువిందు చేస్తోంది. మంచు తెరల నడుమ పరవళ్లు తొక్కే జలధారలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ముంచంగిపుట్టు మండలం కుమడ పంచాయతీ పరిధిలోని జడిగూడ జలపాతం సైతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల సరిహద్దులో ఉన్న తారాబు జలపాతం ఆకాశం నుంచి నేలపైకి జాలువారుతున్నట్లుగా అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది.

● బరడ పంచాయతీ పరిధిలోని హంసబంద, జర్జుల పంచాయతీలోని బురదగుంట, బూసిపుట్టు పంచాయతీలోని నెమలి జలపాతాలు ప్రకృతి ప్రేమికు లను ఆకట్టుకుంటున్నాయి. బుంగాపుట్టు పంచాయతీ రంగినిగూడ జలపాతం పాలనురుగులా పరవళ్లు తొక్కుతోంది. ఇటీవల ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో వెలుగులోకి వచ్చిన ఉంచాయిపాడ జలపాతం సైతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.

మౌలిక సదుపాయాల కొరతతో ఇక్కట్లు

పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆయా ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం ఇబ్బందికరంగా మారింది. తారాబు, జడి గూడ, రంగినిగూడ, హంసబంద, నెమలి జలపాతాల వద్ద తాగునీరు, ఆహారం, వసతి సదుపాయాలు అందుబాటులో లేక సందర్శకులు అవస్థలు పడుతున్నారు. కాటేజీలు లేకపోవడంతో పాటు జలపాతాలకు వెళ్లే మార్గాలు సైతం సక్రమంగా లేవు. కొన్ని చోట్ల స్థానికులు కర్రలు, రాళ్లతో తాత్కాలికంగా దారులు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రమాదకరంగా ఉన్నాయి. జారు డు మార్గాలు, ఇరుకై న దారుల్లో సాహ సోపేతంగా ప్రయాణిస్తూ పర్యాటకులు జలపాతాలను చేరుకోవాల్సి వస్తోంది.

● జలపాతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించి, వసతి, తాగునీరు, భద్రత వంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. ఈ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దితే స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అభిప్రాయపడుతున్నారు.

పసిడి వర్ణంలో వలిసె అందాలు

● జలపాతాల సోయగాలకే పరిమితం కాకుండా నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో విరబూసే వలిసె పూలు సైతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. గిరిజన గ్రామాలకు వెళ్లే దారుల పొడవునా పసుపు వర్ణంలో విరబూసిన వలిసె తోటలు కనువిందు చేస్తున్నాయి. పచ్చని కొండల నడుమ పసిడి వర్ణంలో మెరిసే ఈ పూల తోటలు సందర్శకుల మనసులను దోచుకుంటున్నాయి. పూల తోటల మధ్య ఫొటోలు, సెల్ఫీలు దిగుతూ ఆ మధురమైన ప్రకృతి దృశ్యాలను తమ సెల్‌ఫోన్లు, కెమెరాల్లో బంధించుకుంటున్నారు. జలపాతాల హోరు, వలిసె పూల పరిమళాలు వెరసి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాన్ని పర్యాటకులకు మరపురాని అనుభూతినిచ్చే విడిదిగా మారుస్తున్నాయి.

పాలధారను తలపిస్తున్న తారాబు జలపాతం

రంగినిగూడ జలపాతం ఏరియల్‌ వ్యూ

ఉంచాయిపడా జలపాతం

ఫొటో షూటింగ్‌లకు కేరాఫ్‌..

ఈ జలపాతాలను తిలకించేందుకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలతో పాటు ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. జలపాతాల అందాలను వీక్షిస్తూ సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. ప్రకృతి అందాలకు తోడు ఈ ప్రాంతాలు సినిమా షూటింగ్‌లు, షార్ట్‌ ఫిలిమ్‌లు, వెడ్డింగ్‌ షూటింగ్‌లకు సైతం వేదికలుగా మారుతున్నాయి.

కొండకోనల మధ్య పరవళ్లు తొక్కే జలధారలు.. మంచు తెరల మాటున కనువిందు చేసే ప్రకృతి సోయగాలు.. పసిడి వర్ణంలో మెరిసే వలిసె పూల తోటలు.. వెరసి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. జలపాతాల హోరుతో సందడి నెలకొంటోంది. మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తే పర్యాటకుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. తద్వారా ఆధారిత రంగాల మనుగడకు దోహదపడుతుందని పలువురు సూచిస్తున్నారు.

పర్యాటకంగా అభివృద్ధి చేయాలి

ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో అనేక అద్భుతమైన జలపాతాలు ఉన్నాయి. వీటిని సందర్శించేందుకు తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ముఖ్యంగా తారాబు, డుడుమ జలపాతాల వద్ద సందర్శకుల తాకిడి పెరుగుతోంది. సినిమా షూటింగ్‌లు సైతం జరుగుతున్నాయి. అయినప్పటికీ పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయకపోవడంతో సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. జలపాతాల వద్ద పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తే స్థానిక గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు ఈ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి.

– సీహెచ్‌ అనిల్‌పడాల్‌, గిరిజన యువకుడు, ముంచంగిపుట్టు

తరలివస్తున్న పర్యాటకులు

సందర్శన స్థలాలు కిటకిట

వలిసె పూల పరవశం

సినిమా షూటింగ్‌లకు హాట్‌స్పాట్‌

సౌకర్యాల లేమితో అవస్థలు

అభివృద్ధికి నోచుకోని అందాలు

మౌలిక వసతులు కల్పించాలి

ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా డుడుమ, తారాబు జలపాతాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని నెలలుగా ఇక్కడ సినిమా షూటింగ్‌ల సంఖ్య కూడా పెరిగింది. పర్యాటకులు బస చేసేందుకు కాటేజీలు ఏర్పాటు చేయడంతో పాటు జలపాతాలకు వెళ్లే రహదారులను మెరుగుపరిస్తే సందర్శకుల సంఖ్య మరింత పెరుగుతుంది. ఈ ప్రాంతం ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

– రఘువర్మ, పర్యాటకుడు, విశాఖపట్నం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement