● తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
● మినుములూరులో 14,చింతపల్లిలో 14.7 డిగ్రీలు నమోదు
సాక్షి, పాడేరు: జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. సాయంత్రం ఐదు గంటల నుంచే చలిగాలుల ప్రభావం కనిపిస్తోంది. అర్ధరాత్రి నుంచి దట్టమైన పొగమంచు కురుస్తూ ఉదయం 9 గంటల వరకు పరిసరాలను కప్పేస్తోంది. దీంతో మన్యం ప్రాంతమంతా మంచు తెరల్లో చిక్కుకుంటోంది. శనివారం పాడేరు మండలం మినుములూరు కాఫీ బోర్డు కేంద్రంలో 14 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 14.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రివేళ చలి తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు గిరిజనులు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఉన్ని దుస్తులు, చలిరగ్గుల కొనుగోళ్లు పెరగడంతో వాటి అమ్మకాలు జోరందుకున్నాయి.
డుంబ్రిగుడ: మండలాన్ని మంచు కమ్మేస్తోంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో దట్టమైన పొగమంచు అలుముకుంటూ చలి తీవ్రత పెరుగుతోంది. శనివారం మంచు అందాలను వీక్షించేందుకు వివిధ సన్‌రైజ్ వ్యూపాయింట్లకు పర్యాటకులు తరలివచ్చి ప్రకృతి సోయగాలను ఆస్వాదించారు. మరోవైపు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో గిరిజనులు చలికి ఇబ్బందులు పడుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
చలి తీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి.రాంబాబు సూచించారు. ఎముకలు కొరికే చలిలో బయటకు వెళ్లేవారు, ఉదయం వేళ వాకింగ్ చేసేవారు తప్పనిసరిగా వెచ్చని ఉన్ని దుస్తులు ధరించాలని తెలిపారు. కాళ్లకు బూట్లు, చేతులకు గ్లౌజులు వేసుకుని బయటకు వెళ్లాలని సూచించారు. చలి నుంచి శరీరాన్ని కాపాడుకునేందుకు వేడివేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని వైద్యాధికారి సూచించారు.


