తాచేరు వద్ద తప్పని కష్టాలు | - | Sakshi
Sakshi News home page

తాచేరు వద్ద తప్పని కష్టాలు

Nov 15 2026 12:56 PM | Updated on Nov 15 2026 12:56 PM

● 20 రోజులైనా పూర్తికాని డైవర్షన్‌ రోడ్డు పనులు ● పట్టించుకోని కూటమి పాలకులు

బుచ్చెయ్యపేట: భీమునిపట్నం–నర్సీపట్నం (బీఎన్‌) రోడ్డులోని విజయరామరాజుపేట తాచేరు డైవర్షన్‌ రోడ్డు వద్ద ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. తుపాను వర్షాలకు డైవర్షన్‌ రోడ్డు కొట్టుకుపోయి 20 రోజులు గడుస్తున్నా నేటికీ పునరుద్ధరణ పనులు పూర్తికాలేదు. దీంతో అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయంగా ఇరుకై న రహదారులపై రాకపోకలు సాగించాల్సి రావడంతో వాహనదారులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నారు. సరైన రవాణా సదుపాయం లేక వేలాది మంది నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. డైవర్షన్‌ రోడ్డు అందుబాటులో లేకపోవడంతో కేవలం కిలోమీటరు దూరం ప్రయాణించాల్సిన వారు అదనంగా 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. తాచేరు నదిలో నీటి ప్రవాహం తగ్గినప్పటికీ డైవర్షన్‌ రోడ్డు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒకరోజు పనులు చేపట్టి రెండు రోజులు నిలిపివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో అసంపూర్తిగా ఉన్న డైవర్షన్‌ రోడ్డుపై నుంచి ద్విచక్ర వాహనదారులు, పాదచారులు ప్రాణాలను పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు. గతేడాది ఇదే తాచేరు డైవర్షన్‌ రోడ్డు కొట్టుకుపోవడంతో పేట గ్రామానికి చెందిన రైతు, విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందారు. అయినప్పటికీ అధికారులు, పాలకులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నామినేషన్ల దాఖలాకు తప్పని ఇబ్బందులు

డైవర్షన్‌ రోడ్డుకు అవతల విజయరామరాజుపేట, మంగళాపురం, కుముదాంపేట గ్రామాలకు చెందిన సర్పంచ్‌, వార్డు సభ్యుల అభ్యర్థులు ఆదివారం నుంచి వడ్డాదికి వెళ్లి నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంది. అయితే డైవర్షన్‌ రోడ్డు పనులు పూర్తికాకపోవడం, వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ఆయా గ్రామాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తాచేరు డైవర్షన్‌ రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేసి, ప్రజలకు రవాణా సదుపాయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement