మునగపాక : సర్పంచ్ పదవులకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. గ్రామానికి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.లక్షల్లో ఇస్తామంటూ కొందరు ముందుకొస్తున్నారు. మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఇప్పటికే పోటీ చేసే వ్యక్తులు తమకు అనుకూలంగా ఉండే వారు, వ్యతిరేకులు ఎవరనే వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా తనకు అండగా ఉండేందుకు సుముఖత చూపే వారి వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబ, బంధుత్వ బలాబలాలు బేరీజు వేసుకుంటూ ఈ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు ఆర్థికబలం ఉన్న వారు పోటీ లేకుండా తనకు పంచాయతీ సర్పంచ్ పదవి అప్పగిస్తే గ్రామాభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ పర్యాయం అవకాశంకల్పిస్తే పంచాయతీ పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేస్తానంటూ నమ్మకంగా చెబుతున్నారు.
తాజాగా ఉమ్మలాడలో పలువురు ఆశావాహులు తమకు అవకాశం కల్పిస్తే లక్షలాది రూపాయలను గ్రామాభివృద్ధికి కేటాయిస్తానంటూ వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసుకుంటున్నారు. నాగులాపల్లిలో పాలసంఘ అధ్యక్షుడు దొడ్డి బుజ్జి తనకు సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధికి రూ.50 లక్షలు అందిస్తానంటూ ముందుకొచ్చారు. ఒంపోలులో కూడా ఒక పార్టీకి చెందిన నాయకులు తమకు సర్పంచ్ పదవి కట్టబెడితే పరిస్థితిని బట్టి సాయం చేస్తామంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తం మీద సర్పంచ్ పదవులకు భారీగా డిమాండ్ ఏర్పడింది.


