అనకాపల్లి : చెరువు తవ్వించి ఎటువంటి గట్టు వేయకుండా వదిలేసిన చోట ప్రమాదవశాత్తూ యువకుడు పడి మృతి చెందిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలివి. మండలంలో గొలగాం పంచాయతీ పరిధిలో గొలగాం గ్రామానికి చెందిన సేలపరెడ్డి మణికంఠ (25) గేదెలు కాసుకుంటూ చెరువు వద్ద చదువుకుంటున్నాడు. గేదె చెరువులోనికి పోయిందని గమనించిన మణికంఠ ఒక్కసారిగా చెరువు వద్దకు వెళ్లడంతో లోతుగా ఉన్న బురదలోనికి దిగిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు నాగరాజు అనంత, తమ్ముడు జస్వంత్లు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీసి బోరున విలపించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎస్ఐ రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. కాగా మృతుడు మణికంఠ డిగ్రీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ కాంపిటేషన్ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. అతడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


