సాక్షి, పాడేరు: వంజంగి గిరిశిఖరాలు పర్యాటక ప్రాంతంగా విశ్వవ్యాప్త గుర్తింపు పొందాయి. చలికాలం ప్రారంభం కావడంతో వంజంగి పొగమంచు, మేఘాలు, సూర్యోదయ అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. అయితే వంజంగి నుంచి శిఖరాలకు వెళ్లే సుమారు 3 కిలోమీటర్ల ఘాట్‌రోడ్డు మాత్రం శిథిలావస్థకు చేరింది. గోతులతో అధ్వానంగా మారిన రహదారి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం కనీసం దృష్టి సారించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు హామీ ఏమైంది?
గతేడాది ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని వంజంగి పంచాయతీ కేంద్రంలోనే నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఘాట్‌రోడ్డు పూర్తిస్థాయిలో బాగుపడుతుందని గిరిజనులు, పర్యాటకులు ఆశించారు. అయితే ఆచరణలో మాత్రం ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ప్రస్తుతం ఈ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది.
వర్షాలతో రోడ్డుకు కోత
గోతులతో ఇప్పటికే వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిన ఘాట్‌రోడ్డుకు ఇటీవల తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు మరింత నష్టం కలిగించాయి. ఘాట్‌రోడ్డులోని పలు ప్రమాదకర మలుపుల వద్ద రహదారి కోతకు గురైంది. పెద్దపెద్ద గోతులు ఏర్పడటంతో పాటు రోడ్డు అంచులు సైతం వర్షపు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయి. పలుచోట్ల రహదారి పూర్తిగా దెబ్బతింది. సుమారు కిలోమీటరు పొడవున రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారడంతో వాహనాల రాకపోకలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వాహన రాకపోకలు బంద్!
వంజంగి ఘాట్‌రోడ్డు దుస్థితి ప్రమాదకరంగా మారడంతో అటవీశాఖ అధికారులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ రహదారిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. పర్యాటక ప్రాంతమైన వంజంగి హిల్స్ సందర్శనను తాత్కాలికంగా రద్దు చేశారు. వాహనాలు వెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో పర్యాటకులకు నిరాశ ఎదురవుతోంది.
మరమ్మతుల జాడేది?
వంజంగి ఘాట్‌రోడ్డు ప్రమాదకరంగా మారిందని, అత్యవసరంగా మరమ్మతులు చేపట్టి అభివృద్ధి చేయాలని అటవీశాఖ అధికారులు ఐటీడీఏతో పాటు ఇంజనీరింగ్ అధికారులకు నివేదిక అందించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా వాహనాల రాకపోకలు, పర్యాటక సందర్శనను నిలిపివేశారు. అయితే గత ఐదు రోజులుగా రహదారి మరమ్మతులు, ఇతర అభివృద్ధి పనుల జాడ కనిపించడం లేదు. దీంతో పర్యాటకులతో పాటు స్థానిక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో వస్తున్న పర్యాటకులు వాహనాలతో కొండపైకి వెళ్లలేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఘాట్‌రోడ్డుకు అవతల ఉన్న కంబాలబయలు, కొత్తవలస, సంపలు తదితర గ్రామాల గిరిజనులు కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో రవాణా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పర్యాటకంపై ఆధారపడిన వారికి ఉపాధి కరువు
వంజంగి పర్యాటక ప్రాంతాన్ని నమ్ముకుని రిసార్టులు, హోటళ్లు, కాటేజీలు, టెంట్లు నిర్వహిస్తున్న వారికి సందర్శకుల రాక నిలిచిపోవడంతో ఉపాధి దెబ్బతింటోంది. పర్యాటక సీజన్‌లోనే రహదారి మూసివేయడంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి ఘాట్‌రోడ్డుకు తక్షణ మరమ్మతులు చేపట్టి, శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని గిరిజనులు, పర్యాటకులు కోరుతున్నారు.
ఘాట్‌రోడ్డు అభివృద్ధి చేయాలి
రోడ్డు కోతలతో ప్రమాదకరంగా మారిన వంజంగి ఘాట్‌రోడ్డును ప్రభుత్వం వెంటనే అభివృద్ధి చేయాలి.రోడ్డు కొట్టుకుపోయి చాలా రోజులు అవుతున్నా ఇంతవరకు మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల రవాణాకు ఇబ్బంది పడుతున్నాం. పర్యాటకుల వాహనాలు నడిచే పరిస్థితి లేక స్థానికంగా గిరిజనులకు ఉపాధి కరువైంది.గిరిజన గ్రామాలకు పెద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
– మర్రి మోహన్, కంబాలబయలు,
వంజంగి పంచాయతీ, పాడేరు మండలం


