పాడేరు రూరల్: మూడు రోజుల పాటు ఉత్కంఠభరితంగా సాగిన ఎస్‌జీఎఫ్ అండర్–14 బాలబాలికల రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. చివరి రోజు పోటీలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ టి. నిశాంతి హాజరై విజేతలకు షీల్డులు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రత్యేక కోచ్‌లు, ఎస్‌జీఎఫ్ వ్యాయామ ఉపాధ్యాయుల బృందం పర్యవేక్షణలో స్నేహపూర్వక వాతావరణంలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యతో పాటు క్రీడల్లోనూ ఆసక్తి పెంచుకుని ముందుకు సాగాలని సూచించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
విజేత జట్ల వివరాలిలా..
బాలుర విభాగంలో విశాఖ జిల్లా జట్టు ప్రథమ స్థానం, విజయనగరం ద్వితీయ స్థానం, నెల్లూరు తృతీయ స్థానం, చిత్తూరు నాలుగో స్థానం సాధించాయి. బాలికల విభాగంలో విజయనగరం జట్టు ప్రథమ స్థానం, విశాఖ ద్వితీయ స్థానం, తూర్పుగోదావరి తృతీయ స్థానం, అనంతపురం నాలుగో స్థానం దక్కించుకున్నాయి.
జాతీయ స్థాయికి 24 మంది ఎంపిక
రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న వివిధ జిల్లాల క్రీడాకారుల్లో ప్రతిభ కనబరిచిన 12 మంది బాలురు, 12 మంది బాలికలను జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భానుమూర్తిరాజు, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి భూపతిరాజు, అడ్మిన్ సెక్రటరీ లక్ష్మీపార్వతి, మాజీ ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శులు పాంగి సూరిబాబు, కొండబాబు, కోచ్‌లు శ్రీనివాస్, మహేష్‌బాబు, వ్యాయామ ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు.
బాలుర విభాగంలో విశాఖకు ప్రథమ స్థానం
బాలికల విభాగంలో విజయనగరం జట్టుకు విజయం
జాతీయ స్థాయి పోటీలకు 24 మంది క్రీడాకారుల ఎంపిక


