ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత ‘కడప’ | - | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్‌ టోర్నీ విజేత ‘కడప’

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

● రన్నరప్‌గా విజయవాడ జట్టు

● మూడో స్థానంలో తిరుపతి

● ముగిసిన రాష్ట్రస్థాయి

విద్యుత్‌ ఉద్యోగుల పోటీలు

సీలేరు : సీలేరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యుత్‌ ఉద్యోగుల ఫుట్‌బాల్‌ పోటీల్లో కడప ఆపరేషన్‌ సర్కిల్‌ జట్టు విజేతగా నిలిచింది. ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ టోర్నమెంట్‌ శుక్రవారం ఫైనల్స్‌తో ముగిసింది. రాష్ట్రంలోని ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ పోటీలను రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో నిర్వహించారు. టోర్నీలో కడప జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. డాక్టర్‌ ఎన్టీటీపీఎస్‌ విజయవాడ జట్టు ద్వితీయ, తిరుపతి ఆపరేషన్‌ సర్కిల్‌ జట్టు తృతీయ స్థానాల్లో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి సీలేరు స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ జాకీర్‌ హుస్సేన్‌ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా సూపరింటెండింగ్‌ ఇంజినీర్‌ కోయండం చిన్న కామేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్‌ ఉద్యోగుల విధి నిర్వహణలో ఇలాంటి క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. మారుమూల ప్రాంతమైన సీలేరులో రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. మూడు రోజుల పాటు ఎలాంటి వివాదాలకు తావులేకుండా పోటీలు ప్రశాంతంగా ముగియడం అభినందనీయమన్నారు. న్యాయనిర్ణేతలు ఎల్లో కార్డు, రెడ్‌ కార్డులు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా క్రీడాకారులందరూ క్రీడాస్ఫూర్తితో వ్యవహరించడం ప్రశంసనీయమన్నారు. గెలుపోటములు సహజమని, ఓటమిని కూడా క్రీడాస్ఫూర్తితో స్వీకరించాలని సూచించారు. అనంతరం విజేత జట్లకు ట్రోఫీలు, క్రీడాకారులకు వ్యక్తిగత మెమెంటోలు అందజేశారు.

వ్యక్తిగత ప్రతిభకు పురస్కారాలు

టోర్నీలో కడపకు చెందిన బన్నీ బెస్ట్‌ రైడర్‌గా, తిరుపతికి చెందిన దస్తగిరి బెస్ట్‌ గోల్‌కీపర్‌గా, బాలకృష్ణ బెస్ట్‌ డిఫెండర్‌గా ఎంపికయ్యారు. గత 20 ఏళ్లుగా ఫుట్‌బాల్‌ ఆడుతూ జట్టు విజయానికి కృషి చేస్తున్న డాక్టర్‌ ఎన్టీటీపీఎస్‌ విజయవాడ జట్టుకు చెందిన జె. పుల్లయ్యను ముఖ్య అతిథులు ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో క్రీడాకారులు బుచ్చయ్య చౌదరి, రామకృష్ణ, పంపుడు, స్టోర్‌ ప్రాజెక్ట్‌ సీతారాం, ఈ. రాజేంద్రప్రసాద్‌, ఎస్‌ఐ యాసీన్‌, సీలేరు స్పోర్ట్స్‌ కౌన్సిల్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement