రాత్రికి రాత్రే మారిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్
యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో రెండో విడతలో ఎన్నికలు
తొలుత మూడో విడతగా ప్రకటించి.. తాజాగా మార్పు
మారిన పోలింగ్ తేదీలు.. అభ్యర్థుల్లో ఆందోళన
వలస ఓటర్ల రాకపై ప్రభావం
నక్కపల్లి: జిల్లాలోని 24 మండలాల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. అనకాపల్లి, నర్సీపట్నం, అడ్డురోడ్డు రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా అనకాపల్లి, చోడవరం నియోజకవర్గాలను మొదటి విడతలో, నర్సీపట్నం, మాడుగుల నియోజకవర్గాలను రెండో విడతలో, పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాలను మూడో విడతలో చేర్చారు. ఈ మేరకు ఈ నెల 26, 29, డిసెంబరు 2 తేదీల్లో వరుసగా మూడు విడతల పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
తాజా ఉత్తర్వులతో మారిన లెక్కలు
గురువారం రాత్రి జారీ చేసిన తాజా ఉత్తర్వుల్లో రెవెన్యూ డివిజన్ల ప్రాతిపదికన కాకుండా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని మండలాలను వేర్వేరు విడతల్లో చేర్చారు. దీంతో గతంలో మూడో విడతలో ఉన్న పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాలు రెండో విడతకు మారాయి.
●తాజా షెడ్యూల్ ప్రకారం మొదటి విడతలో ఈ నెల 26న అనకాపల్లి, కశింకోట, బుచ్చెయ్యపేట, చోడవరం, రావికమతం, రోలుగుంట, పరవాడ, సబ్బవరం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో 217 సర్పంచ్ పదవులకు, 2,156 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
●రెండో విడతలో ఈ నెల 29న పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల, యలమంచిలి, అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి మండలాల్లో పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 213 సర్పంచ్ పదవులకు, 2,072 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
●మూడో విడతలో డిసెంబరు 2న చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, వి.మాడుగుల, గొలుగొండ, మాకవరపాలెం, నర్సీపట్నం, నాతవరం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో 212 సర్పంచ్ పదవులకు, 2,030 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు.
నామినేషన్ల ప్రక్రియ ఇలా..
●మొదటి విడత ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 18న పరిశీలన, 19న తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లు, 20న అప్పీళ్లపై తుది నిర్ణయం, 21న ఉపసంహరణ, అదే రోజు తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. 26న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
●రెండో విడత ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 18 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ, 21న పరిశీలన, 22, 23 తేదీల్లో తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీళ్లు, వాటిపై తుది నిర్ణయం, 24న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. 29న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
●మూడో విడత ఎన్నికలకు ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 20 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ, 24న పరిశీలన, 25న అపీళ్లు, 27న నామినేషన్ల ఉపసంహరణ, అదే రోజు తుది అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. డిసెంబర్ 2న పోలింగ్, అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు.
జిల్లాలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ మార్పు తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌కు భిన్నంగా గురువారం రాత్రి పోలింగ్ తేదీలను మారుస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేయడం అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, అధికార యంత్రాంగంలో ఆందోళనకు కారణమైంది. ముఖ్యంగా పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లో మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయని భావించి ఏర్పాట్లు చేసుకున్న ఆశావహులకు తాజా నిర్ణయం ఇబ్బందికరంగా మారింది.
అధికార యంత్రాంగానికీ తప్పని హడావుడి
మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయని భావించి సమయం ఉందని ధీమాతో ఉన్న అధికార యంత్రాంగానికి తాజా షెడ్యూల్ మార్పు కొత్త తలనొప్పిగా మారింది. రెండో విడతకు ఎన్నికలు మారడంతో నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, సిబ్బంది కేటాయింపు, బందోబస్తు వంటి అంశాలపై హడావుడి పెరిగింది. మరోవైపు సర్పంచ్ అభ్యర్థులు వార్డు సభ్యుల ఎంపిక, అవసరమైన ధ్రువపత్రాల సేకరణ, పన్నుల చెల్లింపులు, నామినేషన్ల దాఖలుకు కావాల్సిన పత్రాల సమీకరణలో ఉరుకులు పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
పోలింగ్ తేదీల మార్పుతో పాయకరావుపేట, యలమంచిలి నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ప్రధానంగా వలస ఓటర్ల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో 25కు పైగా మత్స్యకార గ్రామాలు ఉండగా, ఆయా గ్రామాలకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం పూరీ, పారాదీప్, కోణార్క్, శ్రీశైలం, నాగార్జునసాగర్, మచిలీపట్నం, నందికొండ తదితర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. స్థానిక ఎన్నికల సమయంలో ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసుకుని స్వగ్రామాలకు చేరుకుని ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఇలా సుమారు 20 వేల మందికిపైగా ఓటర్లు ఎన్నికల సమయంలో స్వగ్రామాలకు వస్తుంటారని అంచనా. తొలుత డిసెంబరు 2న పోలింగ్ ఉంటుందని ప్రకటించడంతో వలస ఓటర్లను డిసెంబరు 1 నాటికి గ్రామాలకు తీసుకువచ్చేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం వాహనాలకు ముందస్తు అడ్వాన్సులు కూడా చెల్లించారు. తాజాగా పోలింగ్ తేదీ ఈ నెల 29కి మారడంతో ప్రయాణ ఏర్పాట్లను ముందుకు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వృత్తుల్లో ఉన్న ఓటర్లు ఐదు రోజుల ముందుగానే స్వగ్రామాలకు రావడం సాధ్యం కాదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా కుదుర్చుకున్న వాహన ఒప్పందాలు రద్దు చేసుకోవడం, కొత్త తేదీలకు వాహనాలు సమకూర్చుకోవడం అదనపు ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని చెబుతున్నారు.


