మేం ఎక్కడ ఓటేయాలి..! | - | Sakshi
Sakshi News home page

మేం ఎక్కడ ఓటేయాలి..!

Nov 14 2026 12:41 AM | Updated on Nov 14 2026 12:41 AM

రెండు పంచాయతీల్లో 59 మంది ఓట్లు తారుమారు

సరిచేయాలని ఎన్నిక కమిషన్‌ ఆదేశించినా పట్టించుకోని అధికారులు

సర్పంచ్‌ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం

నాతవరం: పంచాయతీ ఓటర్ల జాబితాలో జరిగిన తప్పిదాలను సరిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఆదేశించినా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండలంలోని వెదురుపల్లి, రాజుపేట అగ్రహారం గ్రామ పంచాయతీల్లో 59 మంది ఓట్లు తారుమారుగా నమోదైనా ఇప్పటివరకు సరిచేయకపోవడంతో ఆయా ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.

52 ఓట్లు ఒకచోట.. ఏడు ఓట్లు మరోచోట

వెదురుపల్లి పంచాయతీకి చెందిన 52 మంది ఓటర్ల పేర్లు సరిహద్దు పంచాయతీ అయిన రాజుపేట అగ్రహారం ఓటర్ల జాబితాలో నమోదయ్యాయి. అదేవిధంగా రాజుపేట అగ్రహారం పంచాయతీకి చెందిన ఏడుగురు ఓటర్ల పేర్లు వెదురుపల్లి పంచాయతీ జాబితాలోకి చేరాయి. పంచాయతీ రెవెన్యూ అధికారులు చేసిన ఈ పొరపాట్లను రాజుపేట అగ్రహారం మాజీ సర్పంచ్‌, వైఎస్సార్‌సీపీ నాయకుడు గుడపర్తి అచ్చియ్యనాయుడు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఓటు వేయడానికి వెళ్లినా అడ్డంకులేనా?

వెదురుపల్లిలో నివాసం ఉంటున్న 52 మంది ఓటర్లకు అక్కడే ఆధార్‌ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, భూములు, నివాస గృహాలు ఉన్నాయి. అయినా వారి ఓట్లు రాజుపేట అగ్రహారం పంచాయతీ జాబితాలో ఉండటంతో అక్కడ ఓటు వేయడానికి వెళ్లినప్పుడు స్థానికంగా గుర్తింపు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. రాజుపేట అగ్రహారం పంచాయతీకి చెందిన ఏడుగురు ఓటర్ల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. దీంతో రెండు పంచాయతీలకు చెందిన మొత్తం 59 మంది ఓటర్లు రానున్న సర్పంచ్‌ ఎన్నికల్లో తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ విషయంపై మండల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జి.మంగవేణిని సంప్రదించగా.. తాను జెడ్పీటీసీ, ఎంపీటీసీ సెగ్మెంట్లకు సంబంధించిన అంశాలను పరిశీలించానని తెలిపారు. పంచాయతీ సర్పంచ్‌, వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితా, ఇతర అంశాలు ఎంపీడీవో ఆధ్వర్యంలో ఉన్నాయని వివరించారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలోని తప్పులను సరిచేయాలని కోరుతున్నారు.

గత నెల 19న వచ్చిన రాష్ట్ర ఎన్నికల కమిషర్‌ ఆదేశాలు

రాజుపేట అగ్రహరం పంచాయతీ ఓటర్లు జాబితాలో నమోదైన వెదురుపల్లి పంచాయతీకి చెందిన ఓటర్లు

కమిషనర్‌ వరకు వెళ్లినా ఫలితం శూన్యం

ఈ సమస్యపై అచ్చియ్యనాయుడు సెప్టెంబరు 7న నాతవరం తహసీల్దార్‌ ఓ.చందనరేఖకు స్వయంగా ఫిర్యాదు చేశారు. అయినా స్పందన లేకపోవడంతో అక్టోబరు 12న కలెక్టలేట్‌లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. అదే రోజు నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ను కలిసి రెండు పంచాయతీల ఓటర్ల జాబితాల్లో చోటుచేసుకున్న అవకతవకలను వివరించారు. దీంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఆన్‌లైన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్‌ ఓటర్ల జాబితాలో జరిగిన తప్పిదాలను యుద్ధప్రాతిపదికన సరిచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారులైన ఉమాశంకర్‌ గణేష్‌, గుడపర్తి అచ్చియ్యనాయుడులకు ఓట్లను సరిచేస్తామని కమిషనర్‌ కార్యాలయం నుంచి రిజిస్టర్డ్‌ పోస్టు ద్వారా లేఖలు కూడా అందాయి. కమిషనర్‌ ఆదేశాల మేరకు అక్టోబరు 20న పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు గ్రామాల్లో వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. తప్పుగా నమోదైన ఓట్లను సరిచేస్తామని అచ్చియ్యనాయుడుకు హామీ ఇచ్చారు. దీంతో రెండు పంచాయతీలకు చెందిన బాధిత ఓటర్లు ఆధార్‌ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలతో అధికారులను సంప్రదించారు. అయినా ఓటర్ల జాబితాలో ఎలాంటి మార్పులు చేయకుండా అధికారులు వదిలేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement