విద్యుత్ దీపాల శోభతో వెలుగులీనిన పట్టణం
జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన జనం
ఉర్రూతలూగించిన సాంస్కృతిక ప్రదర్శనలు
యలమంచిలి రూరల్: పోటెత్తిన భక్త జన ప్రవాహంతో రహదారులు కిక్కిరిసిపోయాయి. పంచరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం యలమంచిలి జనసంద్రమైంది. జిల్లా నలుమూలల నుంచి భారీ ఎత్తున జాతరకు తరలివచ్చారు. దీపావళి నుంచి నాగుల చవితి వరకు నిర్వహించిన పంచరాత్రి ఉత్సవాలు శుక్రవారం రాత్రితో ముగిశాయి. ఉత్సవాలను తిలకించడానికి లక్ష మందికి పైగా భక్తులు, సందర్శకులు తరలిరావడంతో యలమంచిలిలో ఎటు చూసినా జన సందోహమే కనిపించింది. ఒకవైపు ఆధ్యాత్మిక పరిమళం.. మరోవైపు సాంస్కృతిక వినోదం మేళవింపుతో ఉత్సవాలు అంబరాన్నంటాయి. ఉత్సవాల్లో భాగంగా భూలోకమాంబ అమ్మవారి ఆలయం వద్ద తీర్థం నిర్వహించారు. చెక్క భజనలు, కోలాటాలు, నేలవేషాలు, తప్పెట్లు, ఏలూరు బృందం ప్రదర్శించిన మహంకాళి నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాల రాకపోకలను మళ్లించారు. ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల స్టేజీలపై భారీగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. డ్యాన్స్‌లు, సంగీత విభావరులు, బుర్రకథలు జనాన్ని మంత్రముగ్ధులను చేశాయి. గురప్ప కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఆకట్టుకుంది.
భూలోకమాంబ, సుబ్రహ్మణ్యస్వామికి ప్రత్యేక పూజలు
తులసీనగర్ భూలోకమాంబ, పాతవీధి సుబ్రహ్మణ్యస్వామి ఆలయాల్లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూలోకమాంబ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. శుక్రవారం నాగుల చవితి కావడంతో పాతవీధిలో కొలువుదీరిన సుబ్రహ్మణ్యస్వామికి అర్చకులు పంచామృతాభిషేకాలు నిర్వహించి, నూతన వస్త్రధారణ చేశారు. భూలోకమాంబ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలకు భక్తులు బారులు తీరారు.
ఉత్సవ కమిటీ చైర్మన్, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్, యలమంచిలి మున్సిపల్ చైర్‌పర్సన్ పిల్లారమాకుమారి, మళ్ల కొండబాబు, కర్రి జానకిరాం తదితరులు భూలోకమాంబ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రముఖులకు ఉత్సవ కమిటీ తరఫున ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.


