దేవరాపల్లి: దేవరాపల్లి–ఆనందపురం మార్గంలో గుడిపాల జంక్షన్ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులోని 32 ప్రయాణికులంతా సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో దేవరాపల్లి మండలం ముషిడిపల్లి శివారు రావాడపాలెంకు చెందిన ద్విచక్ర వాహనదారుడు రావాడ పాలవెళ్లికి ఎడమ కాలు విరిగిపోగా, తలకు బలమైన గాయమైంది. స్థానికులు హుటాహుటిన కె.కోటపాడు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి ప్రయాణికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి నుంచి విశాఖపట్నానికి మధ్యాహ్నం ఒంటిగంటన్నర ప్రాంతంలో 32 మంది ప్రయాణికులతో 12డీ ఆర్టీసీ బస్ బయలుదేరింది. గుడిపాల జంక్షన్ సమీపిస్తున్న సమయంలో రోడ్డు ప్రక్కనే ఉన్న వెల్డింగ్ షాపులో నుంచి ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి రోడ్డుపైకి అకస్మాత్తుగా వచ్చాడు. ద్విచక్ర వాహనదారుడిని తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయి ఓ నేల బావి సమీపంలోకి వెళ్లి ఓ పక్కకు ఒరిగిపోయింది. బస్సు పొలాల్లోకి దూసుకుపోవడంతో ప్రయాణికులంతా ప్రాణ భయంతో గట్టి కేకలు వేస్తూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులంతా ప్రాణాలతో సురక్షితంగా బయటపడగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని దేవరాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బస్ డ్రైవర్ సంతోష్ అప్రమత్తంగా వ్యవహరించి అదుపు చేయడంతోనే తామంతా ప్రాణాలతో బయటపడ్డామని బస్సులో ప్రయాణికులు తెలిపారు. కొంచెం ముందుకు వెళ్లి ఉంటే నేలబావిలో బస్సు పడిపోయి పెను ప్రమాదం జరిగేదని, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతోనే తామంతా ప్రాణాలతో భయటపడ్డామని ప్రయాణికులు చెప్పారు.సంఘటన స్థలానికి దేవరాపల్లి, వేపాడ పోలీసులు చేరుకొని ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.


